14 April, 2026 | 1:31 AM

వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ తప్పక ధరించాలి

14-04-2026 12:00 AM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య యాదగిరిగుట్ట, 

ఏప్రిల్ 13 : రోడ్డు ప్రమాద బారిన పడకుండా ఉండాలంటే వాహనదారులు హెల్మెట్, సీటు బెల్టులు తప్పక ధరించాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. సోమవారం యాదగిరిగుట్ట మండలం సైదాపూర్ గ్రామంలో 99రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరైవ్- అలైవ్ ,రోడ్డు భద్రత పై అవగాహన కల్పించి గ్రామానికి చెందిన గ్రామ ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి,బీర్ల శంకర్ సహకారంతో గ్రామంలోని ప్రతి వాహనదారుడికి ఉచితంగా హెల్మెట్స్ ని పంపిణీ చేశారు. తదుపరి ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం రోడ్డు ప్రమాదాలు రోజురోజుకీ పెరుగుతున్నాయని, ముఖ్యంగా నిర్లక్ష్యం, అధిక వేగం, హెల్మెట్ వినియోగం లేకపోవడం వల్ల అమూల్యమైన ప్రాణాలు కోల్పోతున్నారన్నారు.

ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలన్నారు. ఈ మధ్యకాలంలో యువత మత్తు పదార్థాలకు డ్రగ్స్, ఆన్లైన్ గేమ్లకు బానిసలవుతున్నారని, కొంతమంది వీటి బారినపడి మరణించారని, యువత ఆదర్శంగా ఉండాలే తప్ప దేనికి బానిసలు కావద్దన్నారు. ఏసిపి శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ ప్రమాదరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు.

సైదాపురం గ్రామంలో హెల్మెట్ లేకుండా వాహనం నడిపిన వారు గ్రామంలోనికి రావద్దని తీర్మానం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సిఐ కృష్ణ, సీఐలు శంకర్ గౌడ్, భాస్కర్, సైదాపురం సర్పంచ్ ఉపసర్పంచ్ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బీర్ల శంకర్, వార్డు సభ్యులు అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు పాల్గొన్నారు.