జారిందా.. గోవిందా..!
ప్రమాదపు అంచున వాహనదారుల ప్రయాణం
రహదారుల కిరువైపులా ప్రమాదకరంగా పేరుకుపోతున్న ఇసుక
ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
జాజిరెడ్డిగూడెం (అర్వపల్లి), మే12: జిల్లాలోని సూర్యాపేట - జనగామ,నకిరేకల్ - తానంచర్ల రెండు జాతీయ రహదారులపై ఇసుక పేరుకుపోయి వాహనదారులు ప్రమాదపు అంచున ప్రయాణం చేస్తూ అదుపుతప్పుతున్నారు. మూసీ నదిలోని జాజిరెడ్డిగూడెం, వంగమర్తి, ఇటుకులపహాడ్ క్వారీల నుండి లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లలో నిత్యం ఈ రహదారుల్లో ఇసుక రవాణా జరుగుతుంది. దీనికి తోడు ప్రభుత్వం మన ఇసుక-మన వాహనం ద్వారా పేరబోయినగూడెం, తుంగగూడెం క్వారీల నుంచి ప్రతి రోజు దాదాపు 600 ట్రాక్టర్లకు పైగా ఇసుక రవాణా అవుతుంది.
రాలి పడుతున్న ఇసుక
వాహనాలలో ఇసుక రవాణా జరుగుతున్న సమయంలో రాలి కింద పడుతుంది.దీంతో ఈ రహదారి వెంట వెళ్లే ద్విచక్ర వాహనదారులు,ప్రయాణికుల కళ్ళల్లో దుమ్ము పడుతుంది. ద్విచక్ర వాహనదారులు ఈ రహదారిపై వెళ్లేటప్పుడు రోడ్లపై ఉన్న ఇసుకతో అదుపుతప్పుతూ ప్రమాదాలకు గురవుతున్నారు.
మొక్కుబడిగా హైవే కాంట్రాక్టర్లు అప్పుడప్పుడు రోడ్లపై పడిన ఇసుకను తొలగిస్తున్నారు. కానీ ప్రతిరోజు వందల వాహనాలలో ఇసుక రవాణా చేస్తుండడంతో వాటి నుంచి ఇసుక రాలిపడుతుంది. దీంతో జారిందా.. గోవిందా.. అంటూ వాహనదారులకు పలువురు జాగ్రత్తలు చెబుతున్నారు. ప్రమాదం పొంచి ఉండడంతో ఈ హైవేలపై ఇసుక పడకుండా చూడాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.
బైకులు అదుపుతప్పి పడుతున్నాయి
సూర్యాపేట - జనగామ హైవేపై నిత్యం మా గ్రామం నుంచి మండల కేంద్రం అర్వపల్లికి వచ్చి వెళ్లేటప్పుడు రోడ్లపై ఉన్న ఇసుకతో బైక్ అదుపుతప్పుతుంది.అలాగే జాజిరెడ్డిగూడెం నుండి తిరుమలగిరికి వెళ్లాలన్న రోడ్లపై పడ్డ ఇసుకతో వాహనాలు అదుపుత ప్పుతున్నాయి.
- చెరుకు సైదులు, వాహనదారుడు






