23 May, 2026 | 12:55 AM

అభివృద్ధి సంక్షేమం రెండు కళ్లుగా ముందుకు..

23-05-2026 12:00 AM
  1. జిల్లా మంత్రిగా ప్రజా సమస్యల పరిష్కారం నా బాధ్యత..
  2. జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం..
  3. జగిత్యాల జిల్లా ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక సమావేశంలో మంత్రి అడ్లూరి

జగిత్యాల,మే 22 ( విజయక్రాంతి ) :అభివృద్ధి సంక్షేమ రెండు కళ్ళుగా ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక జగిత్యాల జిల్లా సమావేశం జిల్లా కేంద్రంలోని సుమంగళి గార్డెన్స్ లో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరయ్యారు.ప్రజా సమస్యలే పరిష్కారంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి అడ్లూరి అన్నారు.

99 రోజులపాటు పది అంశాలపై ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక గ్రామ, మండల, నియోజకవర్గ మరియు జిల్లా స్థాయి సమీక్ష సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలు నివేదికలను తయారుచేసి దశలవారీగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని వివరించారు.ప్రభుత్వం ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల విద్యకు ప్రాధాన్యమిస్తుందని ఇందులో భాగంగా ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. జగిత్యాల నియోజకవర్గానికి సంబంధించి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూలుకు స్థలం కేటాయించామని తెలిపారు.జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై నడుస్తున్న వివాదంపై మంత్రి స్పందించారు.

కేంద్రీయ విద్యాలయానికి అవసరమైతే మరో మూడు ఎకరాల స్థలం కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో క్రీడా మైదానం ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.జిల్లాలో ఈ ఏడాది అధిక మొత్తంలో వరి, మొక్కజొన్న దిగుబడులు వచ్చాయని ఇప్పటి వరకు జగిత్యాల జిల్లాలో 35 వేల మెట్రిక్ టన్నుల మొక్కజొన్న కొనుగోలు చేశామని 2.60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు వివరించారు.

ప్రజా సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఈ సందర్భంగా కోరారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంగనభట్ల దినేష్, జగిత్యాల ధర్మపురి మున్సిపల్ చైర్మన్లు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.