03-11-2025 05:01:05 PM
గోవింద నామస్మరణతో మారుమ్రోగిన మత్స్య"గిరులు"
కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి..
వలిగొండ (విజయక్రాంతి): జగాలనేలే జగనానందకారుడు నారసింహుడి కళ్యాణోత్సవం మత్యాద్రిలో సోమవారం మధ్యాహ్నం వేద పండితుల మంత్రోచ్ఛరణాలతో నయనానందకరంగా నిర్వహించారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి వారి ఎదుర్కోళ్లను ఘనంగా నిర్వహించగా ఆకాశమంత పచ్చని తోరణాల పందిరిలోకీ భక్తులు జగద్రక్షక, కోరిన కోరికలు తీర్చే మత్స్యగిరీష అంటూ భక్తుల నామస్మరణతో తీసుకువచ్చారు. కల్యాణోత్సవం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలను, ముత్యాల తలంబ్రాలను చైర్మన్ కొమ్మారెడ్డి నరేష్ కుమార్ రెడ్డి దంపతులు సమర్పించారు.
అనంతరం కళ్యాణోత్సవ ఘట్టాన్ని ప్రారంభించి అమ్మవారికి జీలకర్ర బెల్లం, తాళిబొట్టు, ముత్యాల తలంబ్రాలు పోసే కార్యక్రమం సందర్భంగా భక్తుల గోవింద నామస్మరణంతో మత్స్య గిరులు మారు మ్రోగాయి. కళ్యాణోత్సవంలో పాల్గొన్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి పూర్ణకుంభంతో స్వాగతం కలిపారు అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించగా ఆలయం తరఫున శాలువాతో సన్మానించి ప్రసాదాలను అందజేశారు. కళ్యాణోత్సవంలో వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని కన్నులారా వీక్షించారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి గుట్ట డైరెక్టర్లు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.