03-11-2025 05:03:02 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో సోయాబీన్ కొనుగోలు ప్రక్రియ సజావుగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. సోమవారం విడుదల చేసిన ప్రకటనలో ఆమె మాట్లాడుతూ, రైతులకు టోకెన్లు జారీ చేయడం ఉదయం 6 గంటల నుంచే ప్రారంభమైందని, అన్ని కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి అంతరాయం లేకుండా కార్యక్రమం కొనసాగుతున్నదని వివరించారు. ప్రస్తుతం జిల్లాలో ఏఎంసీ ముధోల్, బోరేగావ్(ముధోల్ మండలం), బాసర ఈ మూడు కేంద్రాల ద్వారా ఇప్పటివరకు 1,400 మందికి పైగా రైతులకు టోకెన్లు జారీ చేసినట్లు తెలిపారు.
మార్కెటింగ్, వ్యవసాయ, రెవెన్యూ, పోలీసు శాఖల సమన్వయంతో కొనుగోలు ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించబడుతున్నాయని పేర్కొన్నారు. రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, క్రమబద్ధంగా టోకెన్లు పొందుతున్నారని కలెక్టర్ తెలిపారు. రైతుల సౌకర్యార్థం, కొనుగోలు కేంద్రాల వద్ద తాగునీరు, నీడ వసతులు, విశ్రాంతి ఏర్పాట్లు కూడా కల్పించామని తెలిపారు. జిల్లా యంత్రాంగం సమన్వయంతో సోయాబీన్ కొనుగోలు నిరంతరంగా కొనసాగుతుందని కలెక్టర్ తెలిపారు.