25-05-2025 12:37:05 PM
కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని చెప్పిన కవిత
కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్‌కు అలవాటు: ఎంపీ లక్ష్మణ్
కవిత లేఖలో కాంగ్రెస్ పై ప్రేమ, బీజేపీపై ద్వేషం కనిపిస్తోంది
హైదరాబాద్: కుటుంబ రాజకీయాలు చేయడం కాంగ్రెస్(Congress party)కు అలవాటు అని బీజేపీ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(BJP MP Laxman) దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. ఏపీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan Mohan Reddy) ఓడిపోగానే ఆయనపైకి సోదరి వైఎస్ షర్మిలను ఎక్కుపెట్టారని లక్ష్మణ్ ఆరోపించారు. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kalvakuntla Kavitha) పేరుతో రాజకీయాలు చేస్తున్నారని సూచించారు.
ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఎంపీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ లో ఎలాంటి కోటరీ ఉందో కవిత వ్యాఖ్యలను బట్టి తెలుస్తోందని జోస్యం చెప్పారు. తండ్రి కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao)ను స్వయంగా కుమారైనే కలిసే పరిస్థితి లేదని తెలుస్తోందని లక్ష్మణ్ వెల్లడించారు. కేసీఆర్ ప్రతిపాదించిన కేటీఆర్(Kalvakuntla Taraka Rama Rao)ను సవాలు చేస్తున్నట్లుగానే కవిత లేఖ, వ్యాఖ్యలు ఉన్నాయని ఆయన తెలిపారు. కేటీఆర్ నాయకత్వాన్ని అంగీకరించేది లేదని కవిత చెప్పకనే చెప్పారని రాజ్యసభ ఎంపీ పేర్కొన్నారు. అన్న ఆధిపత్యాన్ని సవాలు చేయడమే కవిత లక్ష్యమని తెలుస్తోందన్నారు. కవిత లేఖలో కాంగ్రెస్ పై ప్రేమ, బీజేపీపై ద్వేషం కనిపిస్తోందని ఎంపీ వెల్లడించారు. సామాజిక తెలంగాణ గురించి కవిత మాట్లాడటం విడ్డూరంగా ఉందని లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలను పదేళ్లు పట్టించుకోని వారు ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.