29 July, 2026 | 1:13 AM

ఎంఎస్‌ఎంఈ పాలసీ మొదట తెలంగాణలోనే

25-06-2024 04:25 AM
  • హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చుతాం
  • ట్రిపుల్‌ఆర్‌తోపాటు కొత్త రైలు కనెక్టివిటీపై అన్వేషణ 
  • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడి

హైదరాబాద్, జూన్ 24(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈల కోసం కొత్త పాలసీని తీసుకొస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. దేశంలోనే ఎంఎస్‌ఎంఈల కోసమే ప్రత్యేకంగా పాలసీలను తీసుకొస్తున్న మొదటి రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. సోమవారం ఫిక్కి మహిళా అనుబంధ సంస్థ ఎఫ్‌ఎల్‌ఓ ఆధ్వర్యంలో ఎంఎస్‌ఎంఈలు సమ్మిళిత అభివృద్ధి అనే అంశంపై కాన్‌క్లేవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీధర్‌బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు లేనిదే ప్రపంచం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామికంగా ప్రతిరంగం అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

పరిశ్రమల శ్రేయస్సు కోసం గత ప్రభుత్వాలు అనుసరించిన ఉత్తమ విధానాలను తమ సర్కారు కూడా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న ఎంఎస్‌ఎంఈ పాలసీని వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాలసీ రూపకల్పనకు సలహాలు, సూచనలు చేయాలని కోరారు. తాము తీసుకొస్తున్న నూతన పాలసీ ఎంఎస్‌ఎంఈ రంగం సమ్మిళిత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని వెల్లడించారు. ఎంఎస్‌ఎంఈలను తమ ప్రభుత్వం బలోపేతం చేస్తుందని చెప్పారు.

ఐఎస్‌బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీ

రాష్ట్రంలోని యువత నైపుణ్యాన్ని మెరుగుపర్చేందుకు త్వరలో తాము ఐఎస్‌బీ తరహాలో స్కిల్ యూనివర్సిటీని తీసుకొస్తామని శ్రీధర్ బాబు వివరించారు. ఇది భవిష్యత్‌లో డిజిటల్ నైపుణ్యాలను అందించడంలో దోహదపడుతుందని చెప్పారు. అలాగే రాష్ట్రంలో ప్రస్తుతం 200 వరకు గ్లోబల్ కెపబిలిటీ సెంటర్లు(జీసీసీ)లు ఉన్నాయని, భవిష్యత్‌లో మరిన్ని వచ్చే అవకాశం ఉందన్నారు. హైదరాబాద్‌ను ఏఐ రాజధానిగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దాదాపు 200 ఎకరాల్లో ఏఐ యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.

ఎంఎస్‌ఎంఈల అభివృద్ధిలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. 320 కిలోమీటర్ల పొడవైన ఆర్‌ఆర్‌ఆర్‌తో హైదారాబాద్ పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందుతుందని మంత్రి అన్నారు. ఒక్క హైదరాబాద్‌ను మాత్రమే కాదని తెలంగాణలోని ప్రతి ప్రాంతాన్ని పారిశ్రామికంగా  అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ పరిధిలో రైల్వే కనెక్టివిటీ అవకాశాలను ప్రభుత్వం అన్వేషిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. అలాగే ఓఆర్‌ఆర్ లోపల ఐటీ కంపెనీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు పరిధిలో పరిశ్రమలకు ఎక్కువ ప్రయార్టీ ఇస్తామని, మిగతా చోట్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.

ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర

ప్రపంచ ఆర్థికాభివృద్ధిలో ఎంఎస్‌ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎఫ్‌ఎల్‌ఓ హైదరాబాద్ చైర్ పర్సన్ ప్రియా గుజ్దర్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా 50శాతం కంటే ఎక్కువ ఉపాధిని ఎంఎస్‌ఎంఈలే కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అలాగే భారతదేశ డీజీపీలో 30శాతం, ఉత్పాదకతలో 45శాతం, 11 కోట్ల మందికి ఉపాధిని ఎంఎస్‌ఎంఈలు కల్పిస్తున్నాయని ఎఫ్‌ఎల్‌ఓ జాతీయ అధ్యక్షురాలు జయశ్రీ దాస్ వర్మ చెప్పారు. కార్యక్రమంలో ఎన్‌ఐ డైరెక్టర్ జనరల్ డాక్టర్ గ్లోరీ స్వరూప, వీ హబ్ సీఈఓ సీతా పల్లచోళ్ల, తెలంగాణ ప్రభుత్వ ఎంఎస్‌ఎంఈ డైరెక్టర్ వత్సల మిశ్రా పాల్గొన్నారు.