చాంప్ ముంబై
ఐఎస్‌ఎల్ ఫైనల్లో మోహన్ బగాన్‌పై విజయం
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ముంబై సిటీ ఎఫ్‌సీ విజేతగా నిలిచింది. శనివారం సాల్ట్ లేక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్లో ముంబై 3 మోహన్ బగాన్‌ను ఓడించి టైటిల్‌ను అందుకుంది. ముంబై సిటీ ఎఫ్‌సీ తరపున జార్జ్ డియాజ్ (53వ నిమిషంలో), బిపిన్ సింగ్ (81వ నిమిషంలో), జాకుబ్ వోటస్ (90+7వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించగా.. మోహన్ బగాన్ జట్టు తరపున జాసన్ కమింగ్స్ (44వ నిమిషంలో) ఏకైక గోల్ చేశాడు. తొలి అర్థభాగంలో ఇరుజట్లు పలుసార్లు ప్రత్యర్థి గోల్‌పోస్ట్‌లపై దాడులు నిర్వహించినప్పటికి ఫలితం దక్కలేదు. అయితే మరో నిమిషంలో తొలి హాఫ్ ముగుస్తుందనగా కమింగ్స్ గోల్ కొట్టడంతో మోహన్ బగాన్ ఖాతా తెరిచింది.
రెండో అర్థభాగంలో ముంబై సిటీ అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిని ఒక ఆట ఆడుకుంది. ఈ క్రమంలో 53వ నిమిషంలో జార్జ్ డియాజ్ గోల్‌తో ముంబై ఎఫ్‌సీ 1 స్కోరును సమం చేసింది. అనంతరం 81వ నిమిషంలో ఫార్వర్డ్ ప్లేయర్ బిపిన్ సింగ్ మరో గోల్ కొట్టడంతో ముంబై 2 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. నిర్ణీత సమయం ముగిసిన అనంతరం ఇంజ్యూరీ టైమ్‌లో మోహన్ బగాన్ జట్టు గోల్స్ కొట్టడంలో విఫలమైంది. అదే సమయంలో జాకుబ్ గోల్‌తో మెరవడంతో ముంబై ఎఫ్‌సీ 3 స్పష్టమైన ఆధిక్యంలో నిలిచి ఐఎస్‌ఎల్ 2023 సీజన్ చాంపియన్‌గా అవతరించింది. ఈ సీజన్‌లో ‘లీగ్ షీల్డ్ విన్నర్’గా మోహన్ బగాన్ నిలవగా.. అక్కడ రన్నరప్‌గా నిలిచిన ముంబై సిటీ ఐఎస్‌ఎల్‌లో విజేతగా నిలవడం విశేషం. ఇక ముంబై సిటీకి ఇది రెండో ఐఎస్‌ఎల్ టైటిల్. గతంలో 2020 సీజన్‌లోనూ ముంబై విజేతగా నిలిచింది.






