12 July, 2026 | 9:47 AM

బెంగళూరు హ్యాట్రిక్

05-05-2024 12:26 AM

గుజరాత్‌పై ఘనవిజయం 

దంచికొట్టిన డుప్లెసిస్

ఆశలు అడుగంటిని దశలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 

గొప్ప పోరాటం కనబరుస్తోంది. ప్లే ఆఫ్స్ దారులు మూసుకుపోయిన తరుణంలో వరుసగా మూడో విజయం నమోదు చేసుకున్న బెంగళూరు.. పాయింట్ల పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. మొదట బౌలర్లు సమష్టిగా సత్తాచాటి గుజరాత్‌ను తక్కువ స్కోరుకే పరిమితం చేయగా.. ఆనక బ్యాటింగ్‌లో ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. ముఖ్యంగా డుప్లెసిస్ భారీ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. ఫలితంగా మరో 38 బంతులు మిగిలుండగానే బెంగళూరు విజయదుందుభి మోగించింది.

బెంగళూరు: ఐపీఎల్ 17వ సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) హ్య్రాటిక్ కొట్టింది. లీగ్ ఆరంభ దశలో పరాజయాలతో సతమతమైన బెంగళూరు.. తాజా సీజన్‌లో వరుసగా మూడో విజయం నమోదు చేసుకుంది. శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో డుప్లెసిస్ సేన 4 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌ను మట్టికరిపించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 19.3 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌటైంది. షారుక్ ఖాన (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), రాహుల్ తెవాటియా (35; 5 ఫోర్లు, ఒక సిక్సర్), డేవిడ్ మిల్లర్ (30; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) పర్వాలేదనిపించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (2), సాయి సుదర్శన్ (6), వృద్ధిమాన్ సాహా (1), విజయ్ శంకర్ (10) విఫలమయ్యారు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, యష్ దయాల్, విజయ్‌కుమార్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు 13.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్ (23 బంతుల్లో 64; 10 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (27 బంతుల్లో 42; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) దుమ్మురేపారు. అయితే 19 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించిన బెంగళూరును దినేశ్ కార్తీక్ (21 నాటౌట్; 3 ఫోర్లు), స్వప్నిల్ సింగ్ (15 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) విజయ తీరాలకు చేర్చారు. గుజరాత్ బౌలర్లలో జోష్ లిటిల్ 4, నూర్ అహ్మద్ రెండు వికెట్లు పడగొట్టారు. డుప్లెసిస్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా ఆదివారం పంజాబ్‌తో చెన్నై, లక్నోతో కోల్‌కతా తలపడనున్నాయి. 

సిరాజ్ చాన్నాళ్ల తర్వాత..

హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ చాన్నాళ్ల తర్వాత స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్ మూడో బంతికి సాహాను ఔట్ చేసిన సిరాజ్.. మరుసటి ఓవర్‌లో గిల్‌ను కూడా పెవిలియన్ బాట పట్టించాడు. ఈ సీజన్‌లో నిలకడగా రాణిస్తున్న సాయి సుదర్శన్ ఎక్కువసేపు నిలువలేకపోగా.. కోహ్లీ వేసిన అద్భుత త్రోకు షారుక్ ఖాన్ రనౌట్‌గా వెనుదిరిగాడు. ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసిన డేవిడ్ మిల్లర్.. మ్యాక్స్‌వెల్‌కు క్యాచ్ ఇచ్చి డగౌట్ బాట పట్టగా.. రాహుల్ తెవాటియా కొన్ని విలువైన పరుగులు జోడించి జట్టుకు గౌరవప్రద స్కోరు అందించాడు. అనంతరం లక్ష్యఛేదనలో బెంగళూరు చెలరేగిపోయింది. పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ను ముగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగినట్లు ఓపెనర్లు దంచుడే పరమావధిగా రెచ్చిపోయారు. ఒక ఎండ్‌లో కోహ్లీ నిలకడగా ఆడుతుంటే.. మరో ఎండ్‌లో డుప్లెసిస్ పరుగుల వరద పారించాడు. మొదటి ఓవర్‌లో కోహ్లీ రెండు సిక్సర్లతో మోత మొదలు పెట్టగా.. రెండో ఓవర్‌లో డుప్లెసిస్ 4,4,6,4 బాదాడు. మూడో ఓవర్‌లో 6,4తో సరిపెట్టుకున్న డుప్లెసిస్.. నాలుగో ఓవర్‌లో మోహిత్ శర్మకు నాలుగు ఫోర్లు రుచిచూపించాడు. ఈ క్రమంలో డుప్లెసిస్ 18 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. సుతార్ ఓవర్‌లో కోహ్లీ మరో రెండు సిక్సర్లు అరుసుకున్నాడు. ఆరో ఓవర్‌లో 4,6,4 దంచిన డుప్లెసిస్ మరో భారీ షాట్‌కు యత్నించి ఔట్ కాగా.. ఆ తర్వాత ఇన్నింగ్స్ గాడితప్పింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన వాళ్లంతా ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు క్యూ కట్టారు. జాక్స్ (1), రజత్ పాటిదార్ (2), మ్యాక్స్‌వెల (4), గ్రీన్ (1) విఫలమవడంతో ఒకింత సందిగ్ధత ఏర్పడ్డా.. కార్తీక్, స్వప్నిల్ మిగిలిన పని పూర్తి చేశారు. 

సంక్షిప్త స్కోర్లు

గుజరాత్: 19.3 ఓవర్లలో 147 ఆలౌట్ (షారుక్ 37, తెవాటియా 35; యష్ 2/21, విజయ్‌కుమార్ 2/23), బెంగళూరు: 13.4 ఓవర్లలో 152/6 (డుప్లెసిస్ 64, కోహ్లీ 42; లిటిల్ 4/45, నూర్ 2/23). 

పాయింట్ల పట్టిక 2024

జట్టు మ్యా గె ర.రే పా

రాజస్థాన్ 10 8 2 0.62 16

కోల్‌కతా 10 7 3 1.09 14

లక్నో 10 6 4 0.09 12

హైదరాబాద్ 10 6 4 0.07 12

చెన్నై 10 5 5 0.62 10

ఢిల్లీ 11 5 6 10

బెంగళూరు 11 4 7 8

పంజాబ్ 10 4 6 8

గుజరాత్ 11 4 7 8

ముంబై 11 3 8 6

నోట్: మ్యా గెకైగెలిచినవి, ఓకైఓడినవి, ర.రే పాకైవూ