మున్సిపల్ కమిషనర్ ఇటు చూడండి.. రోడ్లపై గుంతలు, నిలిచిన నీరు.
బోధన్, ఆగస్టు 19 (విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని బీ,ఎస్,ఎన్,ఎల్ కార్యాలయం ముందున్న రహదారి వెనుకవైపు రైల్వే గేటు సమీపంలో రోడ్డుపై గుంతలు ఏర్పడి వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధన్ పట్టణంలోని ప్రధాన మార్గాల్లోనే గుంతలు ఏర్పడి నీరు నిలిచిపోతున్నా మున్సిపల్ అధికారులు, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల అధికారులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిరోజూ అధికారులు రాకపోకలు సాగించే మార్గంలోనే గుంతలు, నీటి నిల్వలు ఉన్నప్పటికీ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోకపోవడంపై పట్టణవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి గుంతల్లో నీరు నిలవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి రహదారిపై ఉన్న గుంతలను వెంటనే పూడ్చడంతో పాటు నీరు నిలవకుండా శాశ్వత పరిష్కారం చూపాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.






