17 April, 2026 | 4:53 PM

మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు

02-11-2025 12:00 AM

బెల్లంపల్లి  (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో రెండవ రోజైన శనివారం సైతం మున్సిపల్ అధికారులు రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా కూల్చివేతలు చేపట్టారు. చిరు వ్యాపారుల షెడ్లతోపాటు చిన్నపాటి నిర్మాణాలను జేసీబీల సహాయంతో తొలగించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేశారంటూ చిరు వ్యాపారులు ఆందోళనకు దిగారు.

గత 50 ఏండ్లుగా మెయిన్ బజార్ ప్రాంతంలో చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నామని, 100 ఫీట్ల రోడ్డు విస్తరణ వల్ల తమ ఉపాధిని పూర్తిగా కోల్పోవలసి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. కూల్చివేతలు ఆపాలని హై కోర్టును ఆశ్రయించినట్లు చిరు వ్యాపారులు తెలిపారు.

తమకు ప్రత్యామ్నాయ ఉపాధి చూ పాలని వ్యాపారులు బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌ను వేడుకున్నారు. మహమ్మద్ గౌస్, అతని కుమారుడు ఒంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. పోలీసులు వారిని సముదాయించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ నేతృత్వంలో పోలీసులు బందోబస్తుమధ్య కూల్చివేతలు కొనసాగించా రు.