2 May, 2026 | 7:15 PM

వేతనాల కోసం మున్సిపాలిటీ కార్మికుల నిరవధిక సమ్మె ప్రారంభం

02-05-2026 06:00 PM

కల్లూరు,(విజయక్రాంతి): కల్లూరు మున్సిపాలిటీ కార్మికులు వేతనాల కోసం నిరవధిక సమ్మెను శనివారం నుంచి ప్రారంభించారు. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఈ సమ్మె కొనసాగుతోంది. మున్సిపాలిటీగా ఏర్పడి 11 నెలలు గడిచినా, ఇప్పటివరకు కేవలం రెండు నెలల వేతనాలే చెల్లించారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.మిగిలిన 9 నెలల వేతనాలు అందక జీవనం భారంగా మారిందని తెలిపారు. ఈ సమస్యపై సబ్ కలెక్టర్, మున్సిపాలిటీ చైర్మన్, మున్సిపాలిటీ మేనేజర్‌లకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా ప్రభుత్వం, అధికారుల నుంచి స్పందన రాలేదని పేర్కొన్నారు.దీంతో దిక్కులేని పరిస్థితుల్లో నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ఏఐటీయూసీ కార్యదర్శి సింగ్ నరసింహారావు మాట్లాడుతూ... ప్రజలు కార్మికుల సమస్యను అర్థం చేసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని,సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరారు.జిల్లా ప్రధాన కార్యదర్శి తోట రామాంజనేయులు మాట్లాడుతూ, కార్మికుల జీవనోపాధి కోసం జరుగుతున్న ఈ పోరాటానికి ప్రజలు తమ వంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఏఐటీయూసీ అధ్యక్షులు గాదే లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ,వేము రాంబాబు, మున్సిపాలిటీ జిల్లా ఉపాధ్యక్షులు ఊడల కృష్ణమూర్తి, వజీర్మియా, ప్రకాష్,చిన్న తదితరులు పాల్గొన్నారు.