హత్యా? ఆత్మహత్యా?
- ‘ప్రణీత్ ప్రణవ్’ కౌంటీ విల్లాలో మిస్టరీ డెత్
- సంపులో శవమై తేలిన యువకుడు
- కుమారుడి మృతిపై తల్లిదండ్రుల అనుమానాలు
- కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ‘ప్రణీత్ ప్రణవ్’ వెంచర్‌లో మరో కలకలం రేగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రణీత్ ప్రణవ్ కౌంటీలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూ రు మండలం పల్లర్ల గ్రామానికి చెందిన మేరుగు నాగార్జున (25) బతుకుదెరువు కోసం నగరానికి వలస వచ్చాడు. మేడ్చల్‌లోని ప్రణీత్ ప్రణవ్ కౌంటీ గేటెడ్ కమ్యూ నిటీలో ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
రోజూలాగే మంగళవారం ఉదయం విధులకు హాజరయ్యాడు. సాయంత్రం అయినా నాగార్జున ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు అతడి కోసం వెతికారు. ఈ క్రమంలో వెంచర్‌లో నిర్మాణంలో ఉన్న విల్లా వాటర్ సంపులో నాగార్జున మృతదేహం కనిపించింది.
మేడ్చల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని సంపులో నుంచి వెలికితీసి, పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాగార్జున మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదవశాత్తూ సం పులో పడిపోయాడా? లేక ఎవరైనా హత్య చేసి పడేశారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. తమ కుమారుడి మృతిపై తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేయడంతో, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.






