సిఎంఎంఎఎస్ పోర్టల్‌లో నమోదు చేయాలి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి,(విజయక్రాంతి): జన గణన- 2027కు సంబంధించి గృహ సముదాయాల బ్లాక్ (హౌజ్ లిస్టింగ్ బ్లాక్) లను గుర్తించి సి.యం.యం.ఎఎస్ పోర్టల్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సోమవారం మధ్యాహ్నం జనగణన విధి విధానాలపై హైదరాబాద్ నుండి డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ భారతి హోలికేరి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులతో జన గణన - 2027పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలు సూచనలు చేశారు. మే, 11 నుండి ప్రారంభం కానున్న జనగణన 2027కు అన్ని జిల్లాలలో 10 శాతం అధికం ఎన్యుమేటర్లు, సూపర్వైజర్ లను గుర్తించి నియమించుకోవాలని డైరెక్టర్ భారతీ హోలికేరి ఆదేశించారు.
నియమించిన ఎన్యుమేటర్లు, సూపర్వైజర్ల వివరాలు సి.యం.యం.ఎస్ (సెన్సస్ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) పోర్టల్ లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎన్యుమేటర్లతో పాటు ముందుగా జనగణన చేయాల్సిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లను జనాభా ఆధారంగా, రెవిన్యూ గ్రామ పంచాయతీ, వార్డుల వారిగా హౌజ్ లిస్టింగ్ బ్లాక్ రూపొందించుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. హౌజ్ లిస్టింగ్ అనేది క్షేత్రస్థాయిలో పర్యటించి ఇళ్లలో జనాభా ఆధారంగా హౌజ్ లిస్టింగ్ బ్లాక్ లు చేసుకోవాలని సూచించారు. హౌజ్ లిస్టింగ్ ఏవిధంగా చేసుకోవాలి అనేది పోర్టల్ ద్వారా అవగాహన కల్పించారు.
ఒక్కో హౌజ్ లిస్టింగ్ బ్లాక్ లో 700-850 వరకు జనాభా ఉండే విధంగా చూసుకొని బ్లాక్ లు సిద్ధం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో వెళ్ళి పరిశీలించాకే బ్లాక్ లు చేసుకోవాలని లేని పక్షంలో ఇళ్లు మిస్సింగ్ అయ్యే ప్రమాదం లేదా ఒక బ్లాక్ లో ఎక్కువ మరో బ్లాక్ లో తక్కువ జనాభా ఉండే ప్రమాదం ఉంటుందని తెలియజేశారు. హౌజ్ లిస్టింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేసుకోవాలని సూచించారు. స్పందించిన కలెక్టర్ హౌజ్ లిస్టింగ్ ను నిబంధనల ప్రకారం సిద్ధం చేసుకోవడం జరుగుతుందని, ఎనిమరేటర్లు, సూపర్వైజర్లు సైతం 10 శాతం అధికంగా నియమించుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ ఎన్ ఖీమ్య నాయక్, సి.పి.ఓ హరికృష్ణ, జడ్పీ సి. ఈ. ఒ యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యం ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.




