23 August, 2026 | 2:14 AM

సీఎం టూర్‌పై నోరు విప్పాలి

23-08-2026 01:30 AM
  1. ఇన్‌అప్రాప్రియేట్ పదం, మమ్దానీని కలవడంలో మర్మమేంటో?
  2. పర్యటన రద్దుపై అసలు కారణాలు బయటపెట్టాలి
  3. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నిలదీసిన ఎమ్మెల్సీ దాసోజ్ 

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం పొలిటికల్ క్లియరెన్స్ నిరాకరించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ డా. దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. విదేశీ వ్యవహారాల శాఖ ఉపయోగించిన ఇన్ అప్రాప్రియేట్ అనే పదానికి అసలు అర్థం ఏమిటో? కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కోరారు. సీఎం హోదాకు, పర్యటన ఉద్దేశానికి అనుగుణంగా లేని కార్యక్రమాలు లేదా సమావేశాలు ఏవి? వాటిపై కేంద్రానికి అభ్యంతరం ఎందుకు వచ్చింది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో దాసోజు శ్రవణ్ మాట్లాడారు.

ఆగస్టు 27 నుంచి 30 వరకు అమెరికాలో సీఎం ఎవరెవరిని కలవాల్సి ఉందో అధికారిక షెడ్యూల్లో స్పష్టత లేదన్నారు. న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీని కలవడం వల్లే పర్యటనకు అనుమతి నిరాకరించారనే ప్రచారం జరుగుతోందని, అదే నిజమైతే అధికారిక షెడ్యూల్లో జొహ్రాన్ పేరు ఎందుకు లేదని ప్రశ్నించారు. అసలు కారణాలను బయటపెట్టాలని అన్నారు. 2024లో లేని అభ్యంతరాలు ఇప్పుడెందుకు వచ్చాయని  నిలదీశారు. ఇన్ అప్రాప్రియేట్ పదం వెనుక దాక్కోకుండా నిజానిజాలు ఏంటో అన్ని వివరాలను ప్రజలకు వెల్లడించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను దాసోజ్ శ్రవణ్ డిమాండ్ చేశారు.