12-12-2025 01:39:13 AM
స్టార్ హీరో కార్తి నటించిన కొత్త చిత్రం ‘అన్నగారు వస్తారు’. ఈ సినిమాను నలన్ కుమారస్వామి దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ నెల 12న విడుదల కావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది.
ఈ సినిమా విడుదలను నిలుపుదల చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. పారిశ్రామికవేత్త అర్జున్ లాల్ సుందర్ దాస్ వద్ద స్టూడియో గ్రీన్ కేఈ జ్ఞానవేల్ రాజా రూ.10.35 కోట్లు అప్పు తీసుకున్నారని, ఆ మొత్తం ఇప్పుడు రూ.21.78 కోట్లు అయిందని, దాన్ని చెల్లించాలంటూ సదరు చిత్ర నిర్మాతకు ఉత్తర్వులు ఇవ్వాలని అర్జున్‌లాల్ ప్రతినిధి మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ సినిమా విడుదలకు స్టే విధించాలని పిటిషన్‌లో కోరారు.
అయితే, ఈ పిటిషన్‌ను ఇంతకుముందే విచారించిన హైకోర్టు.. సినిమా విడుదలకు స్టే విధించింది. కాగా, ఈ పిటిషన్ మరోసారి విచారణకు వచ్చింది. పలుమార్లు అవకాశం ఇచ్చినప్పటికీ జ్ఞానవేల్ రాజా అప్పు తిరిగి ఇవ్వనం దున ఆయన ఆస్తులను జప్తు చేయాలని అర్జున్‌లాల్ ప్రతినిధి తరపు న్యాయవాది వాదించారు. అప్పు చెల్లించేదాకా సినిమాపై నిషేధం విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలావుండగా ‘త్వరలో విడుదల’ అంటూ నిర్మాణ సంస్థ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించింది. కాబట్టి కొత్త తేదీని ప్రకటించే అవకాశం ఉంది.