calender_icon.png 5 February, 2026 | 4:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వేదానుయాయి అన్నమయ్య

07-06-2025 12:00:00 AM

ఆచార్య మసన చెన్నప్ప :

ఆరు శతాబ్దాలు గడిచినా అన్నమయ్య అన్ని సంగీత కచేరీలలో సంకీర్తనాచార్యులుగా కొనియాడబడుతూనే ఉన్నారు. త్యాగయ్య కీర్తనల్లో రాముడు, క్షేత్రయ్య కీర్తనల్లో గోపాలకృష్ణుడు కనిపిస్తే, అన్నమయ్య కీర్తనల్లో వేంకటేశ్వరుడు సాక్షాత్కరిస్తాడు. త్యాగ య్య రాముని భక్తుడు, క్షేత్రయ్య కృష్ణభక్తుడు, అన్నమయ్య వేంకటేశ్వరస్వామి భక్తుడు. ఈ ముగ్గురూ తమ ఇష్టదైవాలమీద కీర్తనలు రాసి తమ భక్తిని ప్రక టించుకున్న వారే.

త్యాగయ్య, క్షేత్రయ్యలలో లేని వైదికతను, సామాజికతను అన్న మయ్యలో మనం చూడగలం. అన్నమ య్య సామాజిక సమరసతను సాధించిన వాగ్గేయకారుడు. “మానవులదంతా ఒకే కులం” అన్నాడు. “రాజు నిద్రకు, బంటు నిద్రకు తేడా లేద”న్నాడు. “బ్రాహ్మణుడున్న చోటుగాని, మనం అంత్యజునిగా చూసే మనిషి ఉన్నచోటూ ఒక్కటే” అన్నాడు. “పరబ్రహ్మకు కులభేదాలు లేవు. అతడు అందరివాడు, అందరిలో ఉన్నవాడు” అని ఎలుగెత్తి చాటాడు.

బ్రహ్మ సాక్షాత్కారం పొందినవాడు!

మహారాష్ట్ర వాగ్గేయకారుడైన పురంధర దాసుకు, ఆంధ్రదేశం వాడైన అన్నమయ్యకు మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయి. పురంధర దాసు దృష్టిలో అన్నమయ్య సాక్షాత్తు విష్ణుమూర్తి. అన్నమయ్య దృష్టిలో పురంధర దాసు సాక్షాత్తు పాండురంగ విఠలుడు. బహుశా వీరిద్దరి సంకీర్తనల ప్రభావం వల్లే తెలుగువారు పాండురంగనిలో వేంకటేశ్వరుని దర్శిస్తే, మరాఠీలు ఇక్కడి వేంకటేశ్వరునిలో పాండురంగణ్ణి వీక్షించారు.

అన్నమయ్య మనవడైన చిన తిరుమలాచార్యుడు తన తాతవల్ల “శ్రీహరిని కనే వెరవు” దొరికిందని చెప్పుకున్నాడు. “సరవి బ్రహ్మోపదేశము చేసితివి. శ్రీ వేంకటనాథుని నా తలపులో నిలిపితివి” అని చెప్పడం వల్ల అన్నమయ్యకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగిందని అనుకోవచ్చు.

అన్నమయ్య వేదానుయాయి. ఆయన తన కీర్తనల్లో “వేదం బెవ్వని వెదకెడిని, ఆ దేవుని గొనియాడుడీ” అని వేదవేద్యుడైన పరమాత్మను కొనియాడాడు. అన్నమయ్యది విశిష్టాద్వైత సంప్రదాయం. చిన తిరుమలయ్య తాత బాటలో నడిచి, కేవల అద్వైత వాదులను, వాద, డల్ప, వితండ, ఛలవా దులను ఎదుర్కొన్నాడు. విశిష్టాద్వైతంలో పరమాత్మ స్వామి.

ఉపాస్య దైవం. జీవాత్మ సేవకుడు, ఉపాసకుడు. విశిష్టాద్వైతం అద్వైతంలో లాగా పరబ్రహ్మ ఒక్కడు మాత్రమే ఉన్నాడని చెప్పదు. పరమాత్మ జీవాత్మలతోపాటు ప్రకృతి తత్తాన్నికూడా ఆవిష్కరి స్తుంది. “బ్రహ్మ మీదియని సాహసమున శ్రుతి చాటెడిని” అని అన్నమయ్య వేద ప్రతిపాదిత దైవాన్ని అంగీకరిస్తూనే ప్రకృతిని, జీవాత్మలను గుర్తించాడు.

“పరము అపరము ప్రకృతి యనగా 

వెరవు తెలియుటే వివేకము” 

అంటాడాయన. తత్తదర్శి అంతా ఒకటే అనడు. వస్తువుల మధ్యగల తారతమ్యాలను గ్రహిస్తాడు. అన్నమయ్య దృష్టిలో ‘పరం’ అంటే దేవుడు. ‘అపరం’ అంటే జీవుడు. ప్రకృతియే దేహం. దార్శనికులు ప్రకృతిని సూక్ష్మంగాను, జీవాత్మను సూక్ష్మతరంగాను, పరమాత్మను సూక్ష్మతమంగాను దర్శించారు. అన్నమయ్య దార్శనికుడు కనుక- “జ్ఞానము జ్గేయము జ్ఞానగమ్యమును పూని తెలియుటే యోగము” అంటాడు. జీవాత్మ జ్ఞానం ద్వారా పరమాత్మతో అనుసంధానం కావడమే యోగమని దీని భావం.

“క్షరము, నక్షరము, సాక్షి పురుషుడని 

సరవి తెలియుటే సాత్తికము” 

ఈ పదాలను గమనిస్తే “క్షరం- ప్రకృతి అని అక్షరం జీవాత్మ అని, సాక్షి పురుషుడు పరమాత్మ” అని తేటతెల్లమవు తుంది. భగవద్గీతలోనూ ఇదే విషయాన్ని గుర్తించవచ్చు. 

“ద్వాలిమౌ పురుషా లోకే

క్షర శ్చాక్షర ఏవచ

క్షర స్సర్వాణి భూతాని

కూట స్థోక్షర ఉచ్యతే” (15-16)

“ఉత్తమః పురుష స్తన్యః

పరమాత్మే త్యుదాహృతః

యోలోక త్రయమావిశ్య 

భిభర్తవ్యయ ఈశ్వరః” (15-17)

“ఎవడు మూడు లోకాల్లో ప్రవేశించి భరిస్తున్నాడో, నాశరహితుడో, ప్రపంచం కంటే జీవులకంటే వేరైన వాడో ఆ ఉత్తమ పురుషుడే పరమాత్మ” అని గీత స్పష్టం చేసింది. 

దేవుడు వేరు, జీవుడు వేరు!

అద్వైత వాదుల దృష్టిలో జీవులు లేరు. ప్రపంచం లేదు. ఉన్నది ఒక్క పరబ్రహ్మమే. ఐతే, “దేవుడొక్కడే ఉన్నాడు. అతనికంటే భిన్నమైంది లేదు” అనే వారికి అన్నమయ్య కొన్ని ప్రశ్నలు వేశాడు. వాటికి అద్వైతులు సమాధానం చెప్పవలసి ఉంది. “దేవుడొక్కడే అయితే పాపానికి పుణ్యానికి భేదం ఎక్కడిది?” అంటాడు అన్నమయ్య.

“ఒక్క దేవుడే ఉన్నాడని, జీవులు అనేకమంది” అని చెప్పడం ద్వారా అన్నమయ్యలో వేదవిదుణ్ణి చూస్తాం. “ఒకడు పాపి అయితే అందరూ పాపులు కావాలి. ఒకడు అపవిత్రుడైతే అందరూ అపవిత్రులు కావాలి. ఒకడు సుఖి అయితే అందరూ సుఖులు కావాలి కదా”.  “చూప దేవుడొక్కడతే సురలిందరు కావలదా?” అని పరమాత్మతోపాటు జీవాత్మ లను ప్రస్తావించాడు. 

పై కీర్తనను గమనిస్తే ‘దేవుడు వేరు, జీవుడు వేరనే’ అభిప్రాయం నిశ్చయంగా కలుగుతుంది. అన్నమయ్య దేవునికి, జీవునికి మధ్యగల భేదాన్ని స్పష్టంగా గుర్తించిన పండితుడు. 

“అన్నిటికిని ప్రేరకుడు ఈశ్వరుడింతే

పన్ని ఈతని తెలిసి బ్రతుకుటే జ్ఞానము”

అని జ్ఞానానికి ప్రాధాన్యం ఇచ్చాడు. 

“నేర్వగల దొక్కటే నిశ్చల బ్రహ్మ” అనడం వల్ల సమాధిస్థితిలో అన్నమయ్యకు బ్రహ్మ సాక్షాత్కారం కలిగిందని భావించవచ్చు. సంసార బంధనాలను గురించి- 

“ఎక్కడి దురవస్థ లేటి దేహములోన 

చిక్కి జీవుడు మోక్షసిరి చెందలేడు” 

అని బాధ పడతాడు. 

“మనుజుడై పుట్టి మనుజుని సేవించి

అనుదినమును దుఃఖమంద నేల?” 

అన్న అన్నమయ్య మాటల్నిబట్టి ఈశ్వరోపాసన మాత్రమే మనల్ని త్రివిధ దుఃఖాల నుంచి బయట పడ వేయగలుగుతుందని అర్థమవుతుంది. 

సర్వేశ్వరుడు విష్ణువే!

వేదంలోని పురుష సూక్తాన్ని అపార్థం చేసుకున్న వారిని అన్నమయ్య వెక్కిరిస్తాడు. “పరమాత్మ సర్వవ్యాపకుడైనప్పు డు అతనికి శరీరాన్ని ఎక్కడి నుంచి పెడతాం?” అని అతని ప్రశ్న. ఆయన వెక్కిరింపు ఎలా వుందో గమనించండి. 

“మొగమున బ్రాహ్మలు మొలచిరట

ఆ మూరితి అవయవ రహితమట!

తొడలు వైశ్యుడు, పాదాలు శూద్రులు

అతనికి రూపము లేదట!”

అన్న మాటలు పరమాత్మను సర్వశక్తిమంతునిగా, సర్వజ్ఞునిగా, సర్వభూతాత్మ గా, సకల జీవకోటిని అనుగ్రహించే దయాళునిగా నిరూపిస్తున్నాయి. రూపం లేని భగవంతునికి ఎక్కడి నుంచి రూపాన్ని తెచ్చి పెట్టగలం? కనుక, సర్వేశ్వరుడు విష్ణు వు. విష్ణువు అంటే సర్వవ్యాపకుడు. అంత టా ఉన్న వాడనే భావన ఆవిష్కరింపదగిందని అన్నమయ్య ప్రబోధించాడు. అన్నమ య్య ప్రబోధం అందరికీ శిరోధార్యం.

 వ్యాసకర్త సెల్: 9885654381