17 April, 2026 | 3:08 AM

రేవంత్ దేశ్ తోడో యాత్ర!

17-04-2026 01:10 AM
  1. డీలిమిటేషన్‌పై బహిరంగ చర్చకు సిద్ధమా? 
  2. సీఎంకు బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు సవాల్
  3. ఎంఐఎంకు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నం 
  4. డీలిమిటేషన్‌ను అడ్డుకునేందుకు పెప్పర్ స్ప్రే వాడుతారేమో! 

హైదరాబాద్, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): దక్షిణాదిని, ఉత్తరాదిని విడగొట్టేలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైషమ్యాలు సృష్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. నియోజకవర్గాల పునర్విభజనపై బహిరంగ చర్చకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమా అంటూ సవాలు విసిరారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు.

కావాలనే కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌ను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. ఏఐసీసీ నేత రాహుల్ దేశ్ జోడోయాత్ర చేస్తే.. రేవంత్ మాత్రం దేశ్ తోడో యాత్ర చేస్తున్నాడని విమర్శించారు. బీజేపీ ఉన్నంతకాలం దేశాన్ని విభజించనీయదని అన్నారు. ముస్లిం, ఎంఐఎం పార్టీకు లబ్ధి చేకూర్చేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురు వారం మీడియాతో రాంచందర్‌రావు చిట్‌చాట్ చేశారు. డీలిమిటేషన్‌తో ఎవరికీ, ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదని.. దక్షిణాది సీట్ల సంఖ్య పెరుగుతుందన్నారు. 

కాంగ్రెస్ హయాంలో.. కేరళలో జనాభా తెలంగాణ కంటే తక్కువ అని, మరీ సీట్ల సంఖ్యను ఎలా పెంచారని ఆయన ప్రశ్నించారు. కొన్ని చోట్ల జనా భా ఎక్కువగా ఉన్నా సీట్లు తక్కువగా వచ్చాయని, అలా ఎందుకు జరిగిందన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్‌కు లింక్ ఉంటుందననారు. నాడు 70 కోట్ల జనాభాకు 543 సీట్లు ఉంటే ఇప్పు డు 140 కోట్ల జనాభాకు సీట్లు పెంచాల్సిన అవసరం ఉందా లేదా అనేది కాంగ్రెస్ పార్టీ చెప్పాల న్నారు.

తెలంగాణలో లోక్‌సభ స్థానాలు 17 నుంచి 25కు సీట్లు పెరుగుతాయని, తమిళనాడులో 39 నుంచి 59కి, కేరళలో 20 నుంచి 30కి, కర్ణాటకలో 28 నుంచి 42కు, ఏపీలో 25 నుంచి 37కి, ఒడిస్సాలో 21 నుంచి 31కి పెరుగుతాయన్నారు. తలకు పెడితే కాలికి.. కాలికి పెడితే తలకు అన్నరీతిలో గందరగోళం సృష్టించాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.

రాహుల్, రేవంత్.. ముస్లింలకు, ఎంఐఎంకు లబ్ధి జరిగేలా చూస్తున్నారని మండిపడ్డారు. ఫ్యామిలీ ప్లానింగ్ మనం పాటిస్తున్నాం.. కానీ, ఒక కమ్యూనిటీ (ముస్లిం) దాన్ని పాటించడం లేదని, దీంతో వాళ్ళ సీట్ల సంఖ్య పెరుగుతున్నదన్నారు. జీఎస్‌డీపీ ద్వారా సీట్లను పెంచాలని రేవంత్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. మందుబాబుల నుంచి వచ్చే ఆదాయం ద్వారా సీట్లు పెంచాలని ఆయన అంటున్నారా? అని ప్రశ్నించారు. 

అడ్డుకునే కుట్రలు..

తెలంగాణను అడ్డుకోవాలని నాడు కాంగ్రెస్ పెప్పర్ స్ప్రేతో దాడి చేసినట్లుగానే.. ఇప్పుడు కూడా పార్లమెంట్‌లో అలాగే చేయాలని చూస్తున్నారని, కానీ మా సంఖ్యా బలం ఎక్కువగా ఉండటం వల్ల వారు ధైర్యం చేయకపోవచ్చన్నారు. రేవంత్‌రెడ్డి నేషనల్ లీడర్ అయిపోయాడని ఎద్దేవా చేశారు. రాహుల్‌కు ఏమీ తెలియదు.. అంతా తానే అనే భావనలో రేవంత్ ఉన్నారని పేర్కొన్నారు.

ఇప్పుడు మోదీకి ఎక్కడ క్రెడిట్ దక్కుతుందోనని కాంగ్రెస్ అడ్డుకోవాలని చూస్తోందని, గతంలో ప్రతిపక్షాలను ప్రశ్నించేవారు.. కానీ ప్రాంతాల వారీగా విభజించే వారు కాదన్నారు. రేవంత్, రాహుల్.. ప్రజలను ఆందోళనలకు గురిచేస్తున్నారన్నారు. 1996లో దేవేగౌడ బిల్లును తీసుకొస్తే, అప్పుడు కేవలం పాపులేషన్ ఆధారంగా అమలుచేయాలని చూశారని, అయితే అప్పుడు ఎవరూ దాన్ని సపోర్ట్ చేయలేదన్నారు. ఇప్పుడు ప్రధాని మోదీ చేపడుతుంటే.. రేవంత్‌రెడ్డి దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని విమర్శలు చేస్తున్నారన్నారు.

మహిళలను కించపరిచేలా..

నాడు ములాయం సింగ్ యాదవ్.. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించారని, మహిళా బిల్లుతో చదువు రాని వాళ్లంతా పార్లమెంట్‌కు వస్తారని చులకన చేసి మాట్లాడారన్నారు. డీ లిమిటేషన్ ప్రక్రియ తర్వాత ఎస్సీ, ఎస్టీల సీట్ల సంఖ్య పెరగనుందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, అయినా కొందరు కార్లలో వచ్చి మరీ రేషన్ బియ్యాన్ని తీసుకెళ్లి అమ్ముకుంటున్నారన్నారు. 

డేటా అంతా తప్పుల తడక..

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జనగణన ఎక్కడ, ఎలా చేశారో ఎవరికీ తెలియదని, తమ ఇంటికైతే ఎవ్వరూ రాలేదని.. చాలామంది ఇంటికి అసలు ఎన్యూమరేటర్లు వెళ్లలేదన్నారు. ఎవరి నుంచి డేటా తీసుకోకుండా ఎలా చేసినట్టు అని ప్రశ్నించారు. నిన్న ఇచ్చిన డేటా అంతా తప్పులతడకగా ఉందన్నారు. ముస్లింలను కూడా తగ్గించి చూపించారన్నారు. కాంగ్రెస్.. నార్త్‌లో పోయిందని, త్వరలో సౌత్‌లో కూడా పోవడం ఖాయమన్నారు.

సౌత్-నార్త్ మధ్యలో గొడవ పెట్టేలా వ్యాఖ్యలు చేయడమెందుకు? అని, సీట్ల పెంపు అంశం ఏ ఎన్నిక కోసం తీసుకురావడం లేదన్నారు. కాంగ్రెస్ ట్రాప్‌లో దక్షిణాది ప్రజ లు పడరని, చివరకు కాంగ్రెస్సే ట్రాప్‌లో ఇరుక్కుంటుందన్నా రు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము దేశాన్ని ముక్కలు కానివ్వమన్నారు. ఎవరిని అడిగి డీమిటేషన్ చేస్తున్నారని తమని ప్రశ్నిస్తున్నారు.. అయితే హైదరాబాద్‌ను మూడు ముక్కలుగా ఎవరిని అడిగి చేశారని ఆయన ప్రశ్నించారు. 

లేఖలు లేవు.. లీకులూ లేవు..

తమ పార్టీలో లేఖలు, లైకులు ఏవీ లేవని రాంచందర్ రావు స్పష్టంచేశారు. అన్ని రాజకీయ పార్టీల్లో అంతర్గత సమస్యలుంటాయని, తమది కుటుంబ సమస్యలాంటిదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో పైసల పంచాయితీ అంశంలో ఫ్రాడ్ జరగలేదని, ఏ కేటగిరీలో చాలా పేర్లు వచ్చాయని, కానీ ఆ సీట్లను గెలవలేదు.. సీ కేటగిరీలో ఉన్నవాళ్లు గెలిచారన్నారు.

అయితే గెలవని వారికి ఏ కేటగిరీలో ఎలా చేర్చారని అరా తీశామన్నారు. తమకు ఇతర పార్టీలతో పొత్తు ఏమాత్రం ఉండదని, మా పార్టీలో ఎవరి మధ్య గ్యాప్ లేదని, తాము అధికారంలోకి వచ్చాక పార్టీ ఎవరిని చేస్తే వారే సీఎం అవుతారని ఆయన స్పష్టం చేశారు.