నా లక్ష్యం వర్గీకరణ

10-05-2024 01:18:35 AM

మోదీతోనే ఏబీసీడీ వర్గీకరణ సాధ్యం   

30 ఏండ్ల పోరాటానికి త్వరలోనే ఫలితం   

సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల ద్రోహి 

‘విజయక్రాంతి’ ఇంటర్వ్యూలో మందకృష్ణ మాదిగ

హైదరాబాద్ సిటీబ్యూరో, ప్రధాన ప్రతినిధి, మే 9 (విజయక్రాంతి): ఒక పెద్ద రాజకీయ పార్టీ ఓ సభ పెడితే తోవ ఖర్చులు, బీరు, బిర్యానీతో పాటు డబ్బులు పంచినా ప్రజలు వస్తారన్నా గ్యారెంటీ లేని రోజులివి. కానీ ఒక కుల సంఘం నాయకుడు ‘చలో హైదరాబాద్’, ‘చలో ఢిల్లీ’ అంటే చాలు.. రాష్ట్ర నలుమూలల నుంచి రాజధానుల్లో నీలిరంగులోని కుల సంఘ జెండాలు రెపరెపలాడుతాయి. ఏదైనా లక్ష్యం కోసం కొద్దిరోజులు పోరాడి, మధ్యలో వదిలేసిన నాయకులు ఎందరో ఉన్నారు.

కానీ ఆయన మాత్రం తమ ప్రజల ఆకాంక్షల సాధనకు నల్లని కండువాతో గడిచిన ౩౦ ఏళ్లుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. ఎస్సీ రిజర్వేషన్ల ఫలాలను సమంగా అందించాలని, అందుకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ ఒక్కటే పరిష్కారమని దిక్కులు పెక్కటిల్లేలా గొంతెత్తి చాటుతున్నారు. మాదిగలకు, మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఓ వైపు నిలదీస్తూనే మరోవైపు తమకు న్యాయం చేయండని ప్రతి నాయకుడిని వేడుకుంటున్నారు.

వాస్తవానికి గడిచిన 30 ఏండ్లలో ఆయన మద్దతు తీసుకోని రాజకీయ పార్టీ, నేత లేడంటే అతిశయోక్తి కాదు. ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఎవరు హామీ ఇచ్చినా ఆ పార్టీకి ఆయన జై కొడుతారు. కానీ వాళ్లు ఇస్తామన్నా పదవులు మాత్రం తీసుకోలేదు. కారణం అతనికి ఇచ్చే పదవుల కంటే తమ సామాజిక వర్గ ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్తే తనకు ముఖ్యమని, నా లక్ష్యం వర్గీకరణ అనే చెప్తారు. అయితే ఎన్నో ఏండ్లుగా పోరాడుతున్నా అతని ఆకాంక్ష మాత్రం ఇంకా నెరవేరలేదు.

అట్లాగని పోరాటానికి విరామం ప్రకటించలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మాదిగల గుండె చప్పుడు వినిపిస్తున్నారు. ఆ నాయకుడి పేరు మంద కృష్ణ మాదిగ. 1994లో ‘మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి’ని స్థాపించిన ఆయన నేటి వరకు వర్గీకరణ లక్ష్యంగా పోరాడుతున్నారు. గతంలో అనేక పార్టీలకు మద్దతు ఇచ్చిన మందకృష్ణ ప్రస్తుతం బీజేపీకి మద్దతు ప్రకటించారు. ‘మాదిగల విశ్వరూప మహాసభ’లో ప్రధాని మోదీ ఇచ్చిన హమీ అమలు జరుగుతుందంటున్న ‘మందకృష్ణ మాదిగ’తో విజయక్రాంతి ప్రత్యేక ఇంటర్వ్యూ. మందకృష్ణ ప్రస్థానం, పోరాటం ఆయన మాటల్లోనే...

విరామం లేని పోరాటం...

ఒక లక్ష్యం కోసం మూడు దశాబ్దాలుగా విరామం లేకుండా జరుగుతున్న ఒకే ఒక్క పోరాటం ఎమ్మార్పీఎస్ ఉద్యమం. స్వాతంత్య్ర పోరాటం స్ఫూర్తిగా హక్కుల సాధన కోసం నిలకడగా ఉద్యమిస్తున్నాం. పోరాటాల్లో ఎత్తుపల్లాలు, కష్టాలు, త్యాగాలు సహజం. మా ఉద్యమంలోనూ ఉన్నాయి. నిర్బంధాలు, మరణాలు, అవమానాలను అధిగమిస్తూ గమ్యానికి చేరువయ్యాము. 

ఒకే ఒక్క లక్ష్యం...

ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ కాంగ్రెస్‌పై పోరాటం చేశారు. కొన్ని సందర్భాల్లో వాళ్లతో కలిసి పోటీ చేశాడు. కానీ లక్ష్యం మరువలేదు. అలాగే ఎమ్మార్పీఎస్ కూడా తమ లక్ష్యం కోసం అనేక రాజకీయ జెండాలను భుజాన ఎత్తుకుంది. ఎందుకంటే ఇవ్వాల్సింది అధికారంలో ఉన్న పార్టీలే కదా..! లక్ష్య సాధనకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. 

జనాదరణ తగ్గలేదు...

1994లో ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని మొదలు పెట్టాం. నాటి నుంచి ఏ సభ పెట్టిన ప్రజలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఇందుకు కారణం మాదిగల బలమైన ఆకాంక్ష వర్గీకరణ. ఈ అంశం మాదిగల గుండె చప్పుడుగా మారింది. వర్గీకరణ కల సాకారం అయితే ఎంత లాభం ఉంటుందో మాదిగ మేధావి వర్గానికి తెలుసు. విద్యార్థులకు తెలుసు. రాజకీయ పార్టీలలో పనిచేసేవారికీ తెలుసు. వర్గీకరణ సాధిస్తేనే మాదిగ బిడ్డలు బాగుపడుతారు. ఇది మాదిగల హక్కుల డిమాండ్ మాత్రమే కాదు. ఇది మా అస్థిత్వం, ఆత్మగౌరవం, అభివృద్ధికి పునాది.

అంబేడ్కర్ నినాదమే స్ఫూర్తిగా..

1996 మార్చి 2న ఎమ్మార్పీఎస్ మొదటి బహిరంగ సభ నిజాం కాలేజ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాం. బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేడ్కర్ నినాదమే స్ఫూర్తిగా ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నిర్మించాం. మాదిగల చైతన్యానికి ఒక రూపం తీసుకురావాలనే లక్ష్యంతో పెట్టిన మొదటి సభతోనే రాష్ట్రాన్ని స్తంభింపజేశాం. ప్రభుత్వం ఉలిక్కిపడింది. మాదిగ అనే మూడు అక్షరాలపై చర్చ మొదలైంది. నాటి నుంచి నేటి విశ్వరూప సభ వరకు మాదిగలు కుటుంబాలతో సహా తరలివస్తున్నారు. తరాలు మారుతున్నప్పటికీ ఉద్యమ చైతన్యంలో జోరు తగ్గలేదు. 

న్యాయంవైపే ఉన్నా.. ఉంటా..

సమస్య వ్యక్తిగతమైనా, సామాజానికి సంబంధించినా నేను న్యాయం వైపు నిలబడుతా. ఈ 30 ఏండ్లలో అన్యాయానికి గురైన ప్రతివర్గం వైపు నేను నిలబడ్డా. ఆ క్రమంలోనే ఆరోగ్య శ్రీ వచ్చింది. వర్గీకరణ ఉద్యమం వచ్చింది. మాల సామాజిక వర్గానికి చెందిన శంకర్‌రావుపై అగ్రవర్ణ నాయకుడు దాడి చేస్తే ఆయనకు మద్దతుగా నిలబడ్డా. జహీరాబాద్‌లో కోదండరాం గీతారెడ్డిని కర్రుకాల్చి వాత పెడితే తెలంగాణ వస్తుంది అనడంపై పోరాటం చేసిన. హరీశ్‌రావు ఢిల్లీ భవన్‌లో ఓ అధికారిపై దాడి చేస్తే నిరసనగా ఎమ్మార్పీఎస్ ఆందోళన చేసింది. ఇలా వందల ఉద్యమాలు న్యాయం ఎక్కడ ఉంటే అటువైపే నిలబడ్డాం. 

ఈటల ఆత్మపరిశీలన చేసుకున్నారు...

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్‌తో పాటు కలిసి పని చేసినం. కానీ ఆయన మాట తప్పడంతో కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేసింది. దీనిని జీర్ణించుకోలేని కేసీఆర్ ఈటల రాజేందర్‌ను, కడియం శ్రీహరిని పావుగా వాడుకొని ఎమ్మార్పీఎస్‌ను చీల్చాలని చూశారు.  ఈటల రాజేందర్ ఆత్మపరిశీలన చేసుకున్నారు. అందుకే మల్కాజిగిరిలో ఈటలకు మద్దతుగా ప్రచారం చేస్తున్నా. అలాగే ఆయనపై ఇద్దరు రెడ్లు పోటీ చేస్తున్నారు. బీసీ బిడ్డ ఈటలకే మా మద్దతు ఉంటుంది. ఈటల కూడా కేసీఆర్ బాధితుడే కదా! 

ఆస్థిత్వ, ఆత్మగౌరవ ఉద్యమం...

మాదిగ అని చెప్పుకునేందుకు ఇబ్బంది పడుతున్న పరిస్థితుల నుంచి మాదిగ అని గర్వంగా చెప్పుకునేలా చేసింది ఎమ్మార్పీఎస్. మాది అస్థిత్వ, ఆత్మగౌరవ ఉద్యమం. నా మదిగ, మాదిగ ఉప కులాల ప్రజలే నా ఆభరణం, నా ఐశ్వర్యం.

మూడేండ్లలోనే వర్గీకరణ సాధించాం..

కేసీఆర్ 14 ఏండ్లలో తెలంగాణ తెస్తే.. 30 దాటినా వర్గీకరణ రావడం లేదని కొందరు నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కానీ 1994లో మొదలైన ఉద్యమం 1997లోనే వర్గీకరణ సాధించింది. కానీ కొన్ని నెలల్లోనే సాంకేతిక కారణాలతో హైకోర్టు రద్దు చేసింది. మళ్లీ 1999 నవంబర్‌లో రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ ఆమోదముద్రతో ఏబీసీడీ వర్గీకరణ 2004 నవంబర్ వరకు అమలు జరిగింది. ఆ ఐదేండ్లలో 22వేల ఉద్యోగాలు మాదిగలకు వచ్చాయి. రాష్ట్రపరిధిలో వర్గీకరణ అంశం లేదనే సాంకేతిక కారణాలతో సుప్రీంకోర్టు నిలిపివేయడంతో ప్రస్తుతం అమలు కావడం లేదు. అంటే 30 ఏండ్లలో రెండు సార్లు వర్గీకరణ సాధించాం. 

రేవంత్ రెడ్డి మాదిగల ద్రోహి...

సీఎం రేవంత్‌రెడ్డి మాదిగల ద్రోహి. అందుకే పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క ఎంపీ సీటు కూడా మాదిగలకు ఇవ్వలేదు.  రేవంత్‌రెడ్డి మాలలతో కుమ్మక్కయ్యారు. కర్ణాటకలో మాల సామాజికవర్గానికి చెందిన ఖర్గే మెప్పు కోసం మొత్తం ఎస్సీ సీట్లను కట్టబెట్టారు. ఖర్గే మాట వింటే తన సీటుకు ఎసరు రాదనే భ్రమలో రేవంత్‌రెడ్డి ఉన్నారు. కానీ ప్రస్తుత ఎన్నికలలో మాదిగలు అతనికి తగిన బుద్ధి చెప్తారు. గతంలో వర్గీకరణ చేస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే నాడు మద్దతు ఇచ్చాం. 

త్వరలోనే ఏబీసీడీ వర్గీకరణ...

సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీ మా మాదిగల సభకు వచ్చి ఏబీసీడీ వర్గీకరణ చేసి తీరుతాం అని ప్రకటించారు. ఆయనపై మాకు విశ్వాసం ఉంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం ఎదురు చూస్తున్నాం. ఫిబ్రవరి 6, 7, 8 తేదీలలో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వర్గీకరణ అంశంపై విచారణ జరిపింది. వర్గీకరణకు మద్దతుగా ప్రభుత్వం స్పష్టమైన వైఖరి చెప్పింది. త్వరలోనే తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. న్యాయం 

గెలుస్తుంది. 

కడియం ఒక నియంత..

మాదిగ కులానికి చెందిన రాజయ్యకు కాకుండా కడియం శ్రీహరికి ఎన్నికలలో మద్దతు ఇచ్చాం. కారణం ఆ ఎన్నికలలో సుమారు 10 మంది మాదిగలు పోటీ చేస్తున్నారు. కానీ మాదిగ ఉప కులమైన బైండ్ల కులానికి చెందిన శ్రీహరి మాత్రం ఒక్కడే పోటీ చేస్తున్నారు. మాతో పాటు ఉప కులాలు కూడా చట్టసభలలో ఉండాలనే లక్ష్యంతో నాడు మద్దతు తెలిపాం. కానీ ఆయన నేడు మాదిగలను నియంతలా అణచివేస్తున్నారు.

బీఆర్‌ఎస్‌లో చేరి రాజయ్యకు, ఆరూరి రమేశ్‌కు, పసునూరి దయాకర్‌కు టికెట్లు రాకుండా చేశారు. బీఆర్‌ఎస్ టికెట్ పొందిన తర్వాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరి దయాకర్, రాజయ్య, ఇందిర, దొమ్మాట సాంబయ్య, పరమేశ్వర్ లాంటి నాయకులను ఆగం చేసి తన బిడ్డ కావ్యకు టికెట్ తెచ్చుకున్నారు. నాడు రాజయ్యను డిప్యూటీ సీఎంగా దించడంలోనూ, ఆరూరి రమేశ్, ఇందిర ఓటమిలో కడియం పాత్రం సుస్పష్టం.

బైండ్ల సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ ఒక మాదిగగానే చూశాము. గతంలో ఆయన బైండ్ల అని కూడా చెప్పుకోలేదు. ఇప్పుడు బైండ్ల అని కూడా డౌటు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆయన నియంతలా పనిచేశారు కాబట్టే అతని బిడ్డ కావ్య ఓటమి లక్ష్యంగా ఎమ్మార్పీఎస్ పనిచేస్తుంది. 

చెప్పులు కుట్టుకోవడానికి..

ఆది జాంబవ అరుంధతి సమాఖ్య పేరుతో తొలితరం మాదిగ మేధావులు పెట్టిన సభకు వచ్చిన నాటి ముఖ్యమం త్రి కోట్ల విజయ్‌భాస్కర్‌రెడ్డి మాదిగలు చెప్పులు కుట్టుకునేందుకు ప్రభుత్వపరంగా ఆర్థిక సాయం చేస్తామన్నారు. సీఎం ప్రకటనను విద్యార్థులు, మేధావులు వ్యతిరేకించారు. ఈ విషయం పత్రికలలో వచ్చింది. అప్పుడు నా వయస్సు 29 సంవత్సరాలు.

ముఖ్యమంత్రి వర్గీకరణ అంశాన్ని ప్రస్తావించకుండా చెప్పులు కుట్టడానికి మరిన్ని నిధులు కేటాయిస్తామనడంపై నాడు ప్రభుత్వంలో ప్రజాప్రతినిధిగా ఉన్న టీఎన్ సదాలక్ష్మి గట్టిగా మాట్లాడింది. రిజర్వేషన్లలో మాలలకు 80 శాతం, మాదిగలకు 20శాతం మాత్రమే ఉద్యోగాలు వస్తున్నాయి. మొత్తం జనాభాలో మాదిగల జనాభా 70 శాతం. కానీ 30 శాతం ఉన్నవాల్లే రిజర్వేషన్ ఫలాలు పొందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.