02-11-2025 01:30:06 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): సొంత చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని ఇంటి నుంచి పంపిన కేటీఆర్, ఇప్పుడు పిన్నమ్మ కూతురు సునీతమ్మను బాగా చూసుకుంటానంటే జనం నమ్ముతారా అని సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడా రు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోని సమస్యలను ఇప్పుడు కొత్తగా తెరపైకి తెచ్చి, సెంటిమెంట్ పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న బిల్లా బీఆర్‌ఎస్ నేతలని విమర్శించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి బోరబండలో జరిగిన కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. పదేళ్లు అధికారంలో ఉండి, మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ జూబ్లీహిల్స్ ప్రాంత సమస్యలను ఎందుకు పరి ష్కరించలేదని నిలదీశారు. కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్‌రెడ్డి ఎందుకు నిధులు తీసుకురాలేదని ప్రశ్నించారు. ఇప్పుడు వచ్చి కల్లబొల్లి మాటలు చెపితే ప్రజలు నమ్మరని చెప్పారు.
బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలది ఫెవికాల్ బంధమని, అందుకే లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయని ఆరోపించారు. అందరికీ రేషన్‌కార్డులు, 200 యూనిట్ల ఉచిత విద్యు త్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. ఈ ఉచిత బస్సును రద్దు చేయాలని చూస్తున్న గలీజ్ బుద్ధి బీఆర్‌ఎస్‌ది అని మండిపడ్డారు. పదేళ్లలో ఒక్క మహిళకు కూడా కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదని గుర్తు చేశారు.
తాము సీతక్క, కొండా సురేఖలకు మంత్రి పదవులు ఇచ్చి మహిళలను గౌరవించామని తెలిపారు. గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అజారుద్దీన్‌ను మంత్రిని చేసి జూబ్లీహిల్స్ ప్రజల ముందుకు తీసుకొచ్చామని సీఎం చెప్పారు. మాట ఇస్తే నిలబెట్టుకునే చరిత్ర కాంగ్రెస్‌ది అని, మోసం చేసే చరిత్ర బీఆర్‌ఎస్‌ది అని విమర్శించారు. పీజేఆర్ ఆకస్మిక మరణం తర్వాత ఎన్నిక ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని పెట్టి గెలిచిన దుర్మార్గుడు కేసీఆర్ అని, పేదలను ఆదుకున్న పీజేఆర్ చరిత్ర ఈ బస్తీల్లో ప్రతి తలు పు తట్టినా తెలుస్తుందని అన్నారు.
కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్‌ను గెలిపిస్తే బోరబండను వందల కోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పారు. విజయయాత్రకు వచ్చినప్పుడు బోరబండ చౌరస్తాకు పీజేఆర్ చౌరస్తా అని పేరు పెడుతామని అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. నవీన్ యాదవ్‌ను 30 వేల ఓట్ల మెజారిటీతో గెలిపించి, అభివృద్ధికి పట్టం కట్టాలని ఆయన ఓటర్లను కోరారు.