25 March, 2026 | 5:53 AM

గ్రామీణాభివృద్ధిలో నాబార్డ్ కీలకం

15-02-2025 01:43 AM
  1. విద్యుత్ పంపుసెట్లను ‘సోలార్’కు మార్చాలి
  2. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రాన్ని లీడర్‌గా నిలపాలి
  3. డిజిటల్ బ్యాంకింగ్ రంగాన్ని మరింత విస్తరించాలి
  4. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ ఆవిష్కరణలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క 

హైదరాబాద్, ఫిబ్రవరి 14 (విజయక్రాంతి): వ్యవసాయానికి నాబార్డ్ విరివిగా రుణాలు ఇచ్చి సహకరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క కోరారు. నాబా ర్డ్ సహకారంతో రాష్ర్టంలో భూగర్భ జలాలు పెరిగి రైతులు అనేక పంటలు పండించే స్థాయికి చేరుకున్నారని చెప్పారు.

శుక్రవారం హైదరాబాద్‌లో వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి 2025 నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్‌ను భట్టి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడు తూ.. అభివృద్ధి అనేది కేవలం సంఖ్యల ద్వారా మాత్రమే కాకుండా గ్రామీణ ప్రాం తాలను ఏ విధంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నామనేది ముఖ్యమన్నారు. ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భాగస్వామిగా ఉందన్నారు.

వ్యవసాయ రంగానికి రుణ సహాయం, రైతు ఉత్పత్తిదారుల సంస్థలను బలోపేతం చేయడం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని సూచించారు. అలాగే, డిజిటల్ బ్యాం కింగ్ రంగాన్ని మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు. 

29లక్షల వ్యవసాయ పంపుసెట్లు సోలార్‌వైపు..

గ్రీన్‌హౌస్, పాలీహౌస్,  డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా పంటల సాగుకు నాబార్డ్ ప్రోత్సా హం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. సూక్ష్మ ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా లక్షల మందికి ఉపాధి, రాష్ర్ట ఆర్థిక అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందన్నారు.

రాష్ర్టంలో 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లు ప్రస్తుతం ఉచిత విద్యుత్ పథకం ద్వారా కొనసాగుతున్నాయని, వీటిని క్రమంగా సోలార్ పంపుసెట్లు గా మార్చేందుకు ప్రయత్నాలు జరగాలన్నారు. గ్రీన్ పవర్ ఉత్పత్తిలో జర్మనీ ప్రపం చ లీడర్‌గా ఉందని, ఈ రంగంలో గ్లోబల్ స్థాయిలో తెలంగాణ లీడర్‌గా ఎదిగేందుకు నాబార్డు సహకారం అందించాలని కోరారు.

స్వయం సహాయక సంఘాల ద్వారా 1,000 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తికి ఇంధన శాఖ అధికారులు ఒప్పందం కుదుర్చుకున్నట్టు భట్టి చెప్పారు.

కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుకుప్రోత్సహించాలి

బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనలో సైంటిఫిక్ సాగును నిర్లక్ష్యం చేశారని, తిరిగి ఆ రంగం వైపు వ్యవసాయ శాఖ, నాబార్డ్ అధికారులు దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఎడిబుల్ ఆయిల్ దిగుమతులపై ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండటానికి లక్ష ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు.  తెలంగాణలో కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రోత్సహించడం, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైతులకు శిక్షణ ఇవ్వడం వంటి పనులు నాబార్డు చేయాలని సూచించారు. 

బ్యాంకర్ల తీరుపై తుమ్మల ఆగ్రహం

రైతులతో బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణం చెల్లించలేదన్న కారణంతో సామాన్య రైతులపై బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదన్నారు. ఓ రైతు రుణం కట్టం లేదని అతడి ఇంటిగేటును తీసుకెళ్లిన ఉదంతాన్ని తాను పేపర్లలో చూసినట్లు చెప్పుకొచ్చారు. రూ.10వేల కోట్ల రుణం తీసుకోని చెల్లించని వారిని ఏం చేస్తున్నారని ప్రజలు తమను నిలదీస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో నాబార్డ్ అధికారులు పాల్గొన్నారు.