పాలమూరులో కరువు జూపల్లి పుణ్యమే

27-04-2024 01:57:32 AM

మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి 

నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): పాలమూరులో ప్రస్తుతం కరువు కాటకాలు రావడానికి కారణం ఎక్సైజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు పుణ్యమేనని మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి విమర్శిం చారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణ సమయంలో కాల్వల సామర్ధ్యం పెంచాలని వచ్చిన విజ్ఞప్తులను మంత్రి హోదాలో ఉన్న జూపల్లి కమీషన్లకు కక్కుర్తి పడి వినిపించుకోలేదని.. దాని ఫలితంగానే ఐదు మోటర్లతో ఎత్తిపోయాల్ని నీటిని కేవలం రెండు మోటర్లతోనే ఎత్తిపోయాల్సి వచ్చిందన్నారు. కృష్ణానది జలాల వాటా విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రజలకు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిందన్నారు. మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ శనివారం నాగర్‌కర్నూల్‌కు వస్తున్నారని, రోడ్‌షో కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.