ముసాయిదా ఓటరు జాబితాలో పేర్లు సరిచూసుకోవాలి
అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదయ్యేలా సహకరించాలి
కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్
గద్వాల ఆగస్టు 18 : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో భాగంగా ప్రకటించిన ముసాయిదా జాబితాలో ఓటర్లు తమ పేర్లు, పుట్టిన తేదీ, చిరునామా తదితర వివరాలను సరిచూసుకోవాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.ముసాయిదా జాబితాలో తప్పులు ఉంటే సెప్టెంబర్ 16లోగా అభ్యంతరాలు తెలియజేయాలని తెలిపారు.
జిల్లాలో 63,925 మంది ఓటర్లు ఎన్‌యూమరేషన్ పత్రాలు సమర్పించలేదని, అర్హులైన వారు సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. సుమారు 1.25 లక్షల మంది ఓటర్లు అనమలీస్ జాబితాలో ఉన్నందున ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి సమర్పించాలని తెలిపారు. ఎస్‌ఐఆర్ను విజయవంతం చేసేందుకు రాజకీయ పార్టీలు బూత్ స్థాయి ఏజెంట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని, అర్హులైన ఏ ఒక్కరి ఓటు తొలగిపోకుండా సహకరించాలని కలెక్టర్ కోరారు.






