19 August, 2026 | 3:59 AM

కుంటాల జలపాతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం...

19-08-2026 12:00 AM
  1. ఎకో టూరిజం ద్వారా పర్యాటకులకు మెరుగైన వసతులు...
  2. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు...

ఉట్నూర్, ఆగస్టు 18 : ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుంటాల జలపాతాన్ని మంగళవారం సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు సందర్శించారు. ఈ సందర్భంగా కుంటాల జలపాతం పరిసర ప్రాంతాలను పరిశీలించి, అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదించారు.కుంటాల జలపాతం ప్రకృతి సోయగాలకు నిలయంగా ఉందని, ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపడతామని ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి మంద మకరందు తెలిపారు. ముఖ్యంగా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని, పర్యాటకులకు అవసరమైన మౌలిక వసతులు, సౌకర్యాలను దశలవారీగా ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు.

కుంటాల జలపాతం వద్ద పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు సురక్షితమైన, సౌకర్యవంతమైన వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి పరిరక్షణకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పర్యాటక అభివృద్ధి చేపట్టడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.కుంటాల జలపాతం కేవలం రాష్ట్రం,దేశంలోనే కాకుండా ప్రపంచ పర్యాటక పటంలో ప్రత్యేక గుర్తింపు పొందేలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని మంద మకరందు తెలిపారు. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ఎకో టూరిజం కార్యక్రమాలను ప్రోత్సహిస్తామని చెప్పారు.

ప్రకృతి అందాలను కాపాడుకుంటూనే పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానికంగా ఆర్థిక కార్యకలాపాలు పెరగడంతో పాటు గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. కుంటాల జలపాతం అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తామని తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు కుంటాల జలపాతం పరిసర ప్రాంతాలను పరిశీలించి, పర్యాటకుల సౌకర్యాలు, మౌలిక వసతులు, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన అంశాలపై వివరాలు సేకరించారు.