19 August, 2026 | 2:55 AM

సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలి

19-08-2026 12:00 AM

బైంసా,ఆగస్టు 18( విజయ క్రాంతి):విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలు పెంపొందించుకుంటూ, వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, బాసర ఐఐఐటీలోని సమావేశ మందిరంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటి) హైదరాబాద్ భాగస్వామ్యంతో నిర్వహించిన సెమికండక్టర్ డిజైన్ లపై ఐదు రోజుల ప్రత్యేక వర్క్ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత డిజిటల్ యుగంలో సెమికండక్టర్ తయారీ, డిజైనింగ్ లకు ఎంతో డిమాండ్ ఉందని, ఈ రంగాలు అత్యంత కీలకమైనవని అన్నారు. ఐఐఐటీ విద్యార్థులకు ఇటువంటి శిక్షణ లభించడం ఎంతో గొప్ప విషయం అని తెలిపారు. విద్యార్థులు తమ కోర్ సబ్జెక్టులపై పట్టు సాధించాలని చెప్పారు. లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని శాస్త్ర సాంకేతిక రంగాల్లో గొప్పగా ఎదగాలని కాంక్షించారు.

విద్యార్థుల్లో ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచేలా విద్యా బోధన సాగాలని సూచించారు. విద్యార్థులు అవసరమైన జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు అన్ని వనరులను సమకూరుస్తున్నామని పేర్కొన్నారు. విద్య పూర్తికాకముందే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందేలా తగిన అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులకు బయట సమాజంలో ఉన్న అవకాశాలను వివరించి, వారిలో స్ఫూర్తిని నింపారు. ఏ విషయమైనా కూడా అధ్యాపకులను అడిగి విషయావగాహన పెంచుకోవాలని సూచించారు.

ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించుకొని, క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడు అంశాలపై పట్టు సాధించవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్, వర్సిటీ ఉపకులపతి గోవర్ధన్, ఎన్‌ఐఈఎల్‌ఐటి హైదరాబాద్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ లక్ష్మణ్ కోర్ర, ఓఎస్డి మురళీ దర్శన్, ఐడెక్స్ మాజీ డైరెక్టర్ కల్నల్ (రిటైర్డ్) ఎ.కె. సింగ్, వీర టాక్టికల్ డైనమిక్స్ సీఈఓ సాయి తేజ, క్యూక్లైర్వాయన్స్ క్వాంటం ల్యాబ్స్ వి.పి. సేల్స్ శ్రీనివాస్, అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.