నంది ‘పాడు’ జంక్షన్!
- అద్దంకి _ నార్కెట్ పల్లి రహదారిపై డేంజర్ స్పాట్
- ప్రమాదాలకు నెలవుగా మారిన ప్రదేశం
- వరుస ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న ప్రజలు
- ఇటీవల జరిగిన ప్రమాదంలో బ్రీజా కార్ బీభత్సం
- స్పీడ్ బ్రేకర్ లకు గుర్తింపు చిహ్నాలు లేకే ప్రమాదాలు జరుగుతున్నాయంటున్న
- స్థానికులు ఫ్లై ఓవర్ నిర్మించాలని వేడుకోలు
మిర్యాలగూడ మే 6 : మిర్యాలగూడ, నార్కెట్ పల్లి, అద్దంకి రహదారిలో నందిపాడు జంక్షన్ ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ హైవే నిర్మించి దశాబ్ద కాలం పూర్తి చేసుకోగా ఈ నందిపాడు జంక్షన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాకా ఇప్పటికే వందల మంది ప్రాణాలను కోల్పోయారు. ఈ సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లైఓవర్ నిర్మిస్తామని రెండు సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేశారు. ఇప్పటికీ పనులు మొదలు కాకపోవడంతో ప్రయాణికులు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ప్రాణాల పోతున్నా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న హైవే నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
స్పీడ్ బ్రేకర్ లను గుర్తించకనే ప్రమాదాలు! :
నార్కెట్ పల్లి, అద్దంకి హైవేపై నందిపహాడ్ జంక్షన్ ను యాక్సిడెంట్లు జరిగే ప్రదేశం (బ్లాక్ స్పాట్)గా గుర్తించి హైవేపై ఇరువైపులా స్పీడు బేకర్స్ ను ఏర్పాటు చేశారు. కానీ ఆ స్పీడ్ బ్రేకర్స్ హైవేపై వస్తున్న వాహనదారులకు కనపడకపోవడంతో జంక్షన్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్లు ఎటువంటి సూచిక బోర్డులు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.
బ్రీజా కార్ బీభత్సం:
ఇటీవల ఇక్కడ జరిగిన ఓ ప్రమాదంలో బ్రీజా కారు బీభత్సం సృష్టించింది. విజయవాడ నుండి హైదరాబాద్ కు వెళ్తున్న బ్రీజా కార్ డ్రైవర్ కు నందిపాడు జంక్షన్ వద్ద స్పీడ్ బ్రేకర్లు కనబడకపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న బైకుని ఢీకొట్టడంతో పాటు రోడ్డు పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని, రోడ్డు పక్కన ద్విచక్ర వాహనంపై ఆగి ఉన్న ఇద్దరిని ఢీకొడుతూ ఆగి ఉన్న ట్రాక్టర్ ని బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు తీవ్ర గాయాల పాలవగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురిలో చికిత్స పొందుతూ ఇంకొకరు మృతి చెందారు. ఈ ప్రమాదానికి ప్రధాన కారణం స్పీడ్ బ్రేకర్లు ఉన్నట్టు జంక్షన్ దాటుతున్నట్టు సూచిక బోర్డులు లేకపోవడమే అని వాహనదారులు ప్రజలు చర్చించుకుంటున్నారు.
రోజుకు ఒక్క ప్రమాదమైనా..! :
నందిపాడు జంక్షన్ వద్ద చిన్న, పెద్ద ప్రమాదాలు అనే విషయం పక్కన పెడితే సగటున రోజుకు ఒక్కటైనా జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ జరిగిన ప్రమాథాల్లో కొంతమంది చేతులు, కాళ్లు పోగొట్టుకోగా, ఇంకొంతమంది చిన్న గాయాలతో బయటపడినా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు చెబుతుండటం గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ జంక్షన్ పై దృష్టిని సారించి ప్రమాదాలు జరగకుండా స్పీడ్ బ్రేకర్ లకు గుర్తింపు చిహ్నాలు, సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు. అలాగే మంత్రి ఇచ్చిన హామీ ప్రకారం త్వరగా ఫ్లై ఓవర్ ను నిర్మించి ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు వేడుకుంటున్నారు.
ఫ్లై ఓవర్ నిర్మించాలి
హైవే అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోకపోవడం వల్ల ఇప్పటికే ఈ జంక్షన్ వద్ద జరిగిన ప్రమాదాలలో వందల మంది ప్రాణాలు కోల్పోయారు. మరి కొన్ని వందల మంది శాశ్వత వికలాంగులుగా మారిపోయారు. ఇప్పటికైనా ఫ్లై ఓవర్ నిర్మించి ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలి.
బంటు యాదగిరి నందిపాడు






