31 July, 2026 | 3:48 AM

నల్లమలలో నంది విగ్రహం!

31-07-2026 02:19 AM

మన్ననూరు సమీపంలో రాతి ద్వారం ముందు దర్శనం

అచ్చంపేట, జూలై 30: నల్లమల అటవీ ప్రాంతంలో అకస్మాత్తుగా నంది విగ్రహం ప్రత్యక్షం కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. అమ్రాబాద్ మండలం మన్ననూరు గ్రామ సమీపంలోని హైదరాబాద్‌ శ్రీశైలం జాతీయ రహదారిపై ఉన్న నిరంజన్ షావలి దర్గా వెనుక భాగం ప్రతాపరుద్రుని కోటకు వెళ్లే పూర్వ కాలపు రాతి ద్వారం ముందు గురువారం ఉదయం ప్రయాణికుల కంట పడింది. నల్లరంగులో ఉన్న నంది విగ్రహాన్ని ఇతర ప్రాంతం నుంచి గుర్తు తెలియని వ్యక్తులు వాహనంలో తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళ్లి ఉండవచ్చనే అనుమానాలున్నాయి.

విగ్రహం సుమారు రెండు అడుగుల ఎత్తు, మూడు అడుగుల పొడవు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీంతో అసలు ఈ విగ్రహం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు తీసుకొచ్చారు? ఎందుకు ఇక్కడ వదిలి వెళ్లారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యం ఉన్న ప్రాంతానికి నంది విగ్రహం అకస్మాత్తుగా కనిపించడంతో స్థానికుల్లో ఆసక్తితో పాటు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.