18 July, 2026 | 9:46 PM

నరేంద్ర డిస్ట్రక్టివ్ అలయన్స్

10-06-2024 01:56 AM

మోదీ 3.0 సర్కారుపై కాంగ్రెస్ విమర్శలు

న్యూఢిల్లీ, జూన్ 9: మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణం చేయటంపై కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. ప్రజలు బీజేపీకి సరైన మెజారిటీ ఇవ్వకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాంరమేశ్ ఆదివారం సోషల్‌మీడియాలో సెటైర్లు వేశారు. ఎన్డీయే అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ కాదని నరేంద్ర డిస్ట్రక్టివ్ అలయన్స్ అని వ్యాఖ్యానించారు. ‘2023, మే 28వ తేదీ గర్తుందా? ఆ రోజు సెంగోల్‌ను చేతపట్టుకొని నరేంద్రమోదీ కొత్త పార్లమెంటు భవనంలోకి అడుగుపెట్టారు.

ఆరోజు 1947 ఆగస్టు 15న జరిగిన చరిత్రను వక్రీకరించటమే కాకుండా మోదీని సమ్రాట్‌గా అభివర్ణించేలా తమిళ ఓటర్లకు సందేశమిచ్చారు. మోదీ వాడిన నకిలీ పరికరాన్ని నాడే నేను బయటపెట్టాను. ఆ నాటకం ఇప్పుడు బయటపడింది. సింగోల్ తమిళ చరిత్రకు గౌరవనీయమైన గుర్తు. కానీ, మోదీ చెప్పిన కథలను తమిళ ఓటర్లు ఎన్నికల్లో తిరస్కరించారు. మోదీ రాజకీయంగా, నైతికంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా భారీగా నష్టపోయారు’ అని విమర్శించారు.