నీట్‌పై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తా
లక్షల మందికి అన్యాయం జరిగింది
విద్యార్థుల తరఫున పోరాడుతా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
న్యూఢిల్లీ, జూన్ 9: మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్షలో అవకతవకలపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ విరుచుకుపడ్డారు. విద్యార్థుల తరఫున తన గళాన్ని పార్లమెంట్‌లో వినిపిస్తానని తెలిపారు. నీట్ సమస్యను ప్రస్తావిస్తూ పేపర్ లీకేజీల నుంచి విద్యార్థులకు విముక్తి కలిగిస్తామని, ఇందుకోసం తమ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. నరేంద్రమోదీ ప్రమాణం చేయకముందే నీట్‌లో పెద్ద స్కామ్ బయటపడింది.
ఇది 24 లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లింది. ఒకే పరీక్షా కేంద్రంలో రాసిన ఆరుగురు విద్యార్థులకు 100 శాతం మార్కులు వచ్చాయి. ఇలా పూర్తిస్థాయి మార్కులు రావడం సాంకేతికంగా అసాధ్యం. కానీ ఇప్పటికీ పేపర్ లీక్ అయిందని ఒప్పుకోవడం లేదు. లోక్‌సభలో ఈ విషయాన్ని లేవనెత్తునాని విద్యార్థు లకు హామీ ఇస్తున్నా. మీ గొంతును వినిపిస్తా అని తెలిపారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు కాంగ్రెస్ వద్ద సమగ్ర ప్రణాళిక ఉందని వెల్లడించారు.
విచారణకు కమిటీ నియామకం..
నీట్ ఎగ్జామ్‌కు సంబంధించి కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన చాలా మంది విద్యార్థుల కు భారీగా మార్కులు వచ్చాయని విద్యార్థు లు ఆందోళన వ్యక్తం చేశారు. ఏకంగా 67 మందికి పూర్తి మార్కులతో పాటు ఫస్ట్ ర్యాంకు రావడం గమనార్హం. నీట్‌పై విపక్షా లు విమర్శలు చేస్తుండటంతో కేంద్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. యూపీ ఎస్సీ మాజీ చైర్మన్ సారథ్యంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ వేయాలని నిర్ణయించింది.
ఈ కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) డీజీ సుబోధ్ కుమార్ తెలిపారు. 1,500 మందికిపైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందని, ఆ తర్వాత వారి ఫలితాల్ని సవరించే అవకాశముందన్నారు. పరీక్షలో అవకతవకలు జరగలేదని, పేపర్ లీక్ కాలేదని ఎన్టీఏ స్పష్టతనిచ్చింది. ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల్లో మార్పులు, పరీక్షా కేంద్రాల వద్ద సమయం కోల్పోవడంతో గ్రేస్ మార్కులు ఇచ్చామని, అధిక మార్కులు రావడానికి ఇదే కారమణని వివరించింది.






