ఘనంగా జాతీయ కిసాన్ దివస్
మందమర్రి టౌన్,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం సంద్రోన్ పల్లి రైతువేదికలో భారత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా జాతీయ కిసాన్ దివస్ కార్యక్రమాన్ని మంగళ వారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి (DAO) సురేఖ రైతులకు వివిధ వ్యవసాయ పథకాలపై అవగాహన కల్పించారు. VBGRAM-G కింద అమలవుతున్న ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ పథకం పీక్ సీజన్‌లో వ్యవసాయానికి ఎలా ఉపయోగపడతాయో వివరించారు.
ఈ బిల్ ద్వారా వ్యవసాయ పీక్ సీజన్‌లో గ్రామీణ కూలీలకు ఉపాధి కల్పించడంతో పాటు, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. అలాగే రబీ సీజన్‌కు సంబంధించి పంటల సాగుపై సాంకేతిక సూచనలు, సమతుల్య ఎరువుల వినియోగం, మట్టి పరీక్షల ప్రాధాన్యత గురించి రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయంలో నూతన పద్ధతులను అవలంబిస్తూ మంచి ఫలితాలు సాధించిన రైతులను ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు డాక్టర్ ఎన్. మహేష్, పి. సాధ్వి, వ్యవసాయ విస్తరణాధికారి ముత్యం తిరుపతి, మధు, గ్రామ సర్పంచ్ పొన్నాల, RAWEP విద్యార్థులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






