calender_icon.png 23 December, 2025 | 9:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలి: కలెక్టర్ కుమార్ దీపక్

23-12-2025 07:53:34 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు ప్రక్రియ చేపట్టిందని, ఈ క్రమంలో కొనుగోలు ప్రక్రియను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని తాండూర్ మండలం రేపల్లెవాడలోనీ మహేశ్వరి కాటన్ జిన్నింగ్ మిల్లును సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సిసిఐ ద్వారా రైతుల నుండి నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర చెల్లిస్తుందని తెలిపారు.

ఈసారి రైతుల సౌకర్యార్థం కపాస్ కిసాన్ యాప్ ద్వారా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. రైతులు దళారీలను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన సి సి ఐ కొనుగోలు కేంద్రాలలో నిబంధనల ప్రకారం పత్తిని విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఈ సంవత్సరం క్వింటాల్ పత్తికి రూ 8 వేల 110  మద్దతు ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు.

అధిక దిగుబడి సాధించిన రైతులు తమ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద ఆన్ లైన్ లో వివరాలు నమోదు చేసి ధ్రువీకరించుకోవాలని, పంట ఉత్పత్తి ఆధారంగా కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రైతులు కపాస్ కిసాన్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకుని నిర్ణీత సమయానికి కొనుగోలు కేంద్రాలకు నిబంధనల ప్రకారం నాణ్యమైన పత్తిని తీసుకువచ్చే విధంగా అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. కలెక్టర్  వెంట సంబంధిత అధికారులు, కొనుగోలు కేంద్రం నిర్వహకులు ఉన్నారు.