3 September, 2026 | 5:22 AM

గొల్లల గుడికి జాతీయ హోదా

03-09-2026 | 03:25am
  1. చారిత్రక కట్టడానికి కేంద్రం అధికారిక గుర్తింపు
  2. అధికారిక ప్రకటన జారీ చేసిన ఏఎస్‌ఐ

వెంకటాపూర్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): జయశంకర్ జిల్లా వెంకటాపూర్ మండలంలోని రామప్పలో చారిత్రక గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ (Union Ministry of Culture) పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) ఆగస్టు 31న అధికారిక ప్రకటన జారీ చేసింది. 1958 నాటి ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టంలోని సెక్షన్ 4(3) కింద ఏఎస్‌ఐ ఈ గుర్తింపును ప్రకటించింది.

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన కాకతీయ రుద్రేశ్వర (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో గొల్లల గుడి ఉంది. కాకతీయుల ప్రత్యేక శిల్పకళకు నిదర్శనంగా నిలిచే ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉన్న మండపం, మూడు గర్భాలయాలతో కూడిన త్రికూటాలయ నిర్మాణంతో ప్రత్యేకతను సంతరించుకుంది. ఆలయ ప్రహరీ, పైకప్పు అంచులు, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసలు, సున్నితమైన రంధ్రాల వల పనితనం ఆకట్టుకుంటాయి.

ఆలయ కుడ్యాలపై విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని తదితర దేవతామూర్తులతో పాటు జంతు, పుష్పాలంకరణ శిల్పాలు దర్శనమిస్తాయి. ఆలయం ముందు భాగంలోని ఉప ఆలయాల్లోని ద్వారపాలకుల శిల్పాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. గొల్లల గుడికి జాతీయ ప్రాధాన్య కట్టడం హోదా లభించడంతో పాలంపేట చారిత్రక, పర్యాటక ప్రాధాన్యం మరింత పెరగనుంది.