నిమ్స్‌ను సందర్శించిన నవాబ్ నజాఫ్ అలీఖాన్
పంజాగుట్ట, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ 140వ జయంతిని పురస్కరించుకుని ఆయన వారసుడు నవాబ్ నజాఫ్ అలీఖాన్ నిమ్స్ ఆసుపత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిమ్స్‌లో జరిగిన సమావేశంలో డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప, డీన్ డాక్టర్ లిజా రాజశేఖర్, ఇతర ఉన్నతాధికారులను నజాఫ్ అలీ ఖాన్ శాలువాలతో సత్కరించారు. నిమ్స్ యాజమాన్యం కూడా నిజాం వారసులను ఘనంగా గౌరవించింది.
ఈ సందర్భంగా నవాబ్ నజాఫ్ అలీ ఖాన్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, ఆరోగ్య రంగంలో మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చేసిన సేవలు అజరామరమని కొనియాడారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కేవలం ఏడాదికి ఒక రూపాయి లీజుతో 99 ఏళ్ల పాటు నిమ్స్ ప్రభుత్వానికి అప్పగించిన విషయాన్ని ఆయన గర్వంగా ప్రస్తావించారు. నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప మాట్లాడుతూ.. నిమ్స్ భవిష్యత్తులో 3,500 పడకల సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద అత్యాధునిక వైద్య సంస్థగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం నజాఫ్ అలీ ఖాన్ డయాలసిస్ వార్డును సందర్శించి, రోగులకు పండ్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిజాం వారసులు మిర్ కుతుబుద్దీన్ అలీ ఖాన్, మహమ్మద్ మాసియుద్దీన్ ఖాన్, ఆసుపత్రి వైద్య బృందం పాల్గొన్నారు.




