విద్యార్థుల్లో దేశభక్తి, నాయకత్వ లక్షణాల పెంపునకు ఎన్‌సీసీ దోహదం
మొయినాబాద్, జూన్ 4 (విజయ క్రాంతి): మొయినాబాద్లోని హిమాయత్నగర్లో గల చైతన్య డీమ్డ్ టూ బీ యూనివర్సిటీలో నిర్వహించిన ఎన్సీసీ 7(టీ) బాలికల బెటాలియన్ వార్షిక శిక్షణా శిబిరం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి ఏనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ, విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాల పెంపునకు ఎన్సీసీ ఎంతో దోహదపడుతుందని అన్నారు.
మే 25 నుంచి జూన్ 3 వరకు నిర్వహించిన శిబిరంలో వందలాది మంది విద్యార్థినులు పాల్గొని పరేడ్, విపత్తు నిర్వహణ, ప్రథమ చికిత్స, సామాజిక సేవ తదితర అంశాలపై శిక్షణ పొందారు. శిబిరంలో ప్రతిభ కనబరిచిన క్యాడెట్లకు ప్రశంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ అధికారులు, ఎన్సీసీ శిక్షకులు, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.






