19-06-2025 12:00:00 AM
జగిత్యాల అర్బన్, జూన్ 18 (విజయక్రాంతి): విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణం గా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని జీవితంలో ఉన్నత స్థానం సాధించాలని ఆర్‌ఎస్‌ఎస్ జిల్లా సంఘచాలక్, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారతి ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో రెండవ బ్యాచ్ శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యశస్వి ఎంట్ర్పజెస్ అధినేత కోటగిరి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ రంగు గోపాల్ హాజ రుకాగా ప్రధాన వక్తగా డాక్టర్ ఆకుతోట శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్ సేవా విభాగం సేవా భారతి ద్వారా దేశవ్యాప్తంగా 1,70,000 సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు.
వాల్మీకి ఆవాసం ద్వారా ఉచిత ట్యూషన్ సెంటర్లు, బాల సంస్కార కేంద్రాలు, కుట్టు శిక్షణ కేంద్రంతో పాటు ఉచిత కంప్యూటర్ శిక్షణను అందించడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం కల్పించడం ఏ ప్రభుత్వం వల్ల కూడా సాధ్యం కాదని యువత తమ నైపుణ్యాలను పెంచుకొని స్వయం ఉపాధి కోసం ప్రయత్నించాలన్నారు.
మనదేశంలో నైపుణ్యం గల యువత ఎంతో మంది ఉన్నారని వారు తమ స్టార్టప్ ల ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని తెలిపారు. కంప్యూటర్ దశ దాటి ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) యుగం నడుస్తుందని, ఆ దిశగా యువత నైపుణ్యాలకు మరింత పదునుపెట్టి ఎదగాలన్నారు.
వాల్మీకి ఆవాసం ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి ఆవాస ప్రధాన కార్యదర్శి నందెల్లి మదన్మోహన్ రావు, కమిటీ సభ్యులు అశోక్ రావు, బెజ్జంకి సంపూర్ణ చారి, ఎలగందుల కైలాసం, గౌరిశెట్టి హరీష్, శిక్షణ కేంద్రం ఇంచార్జ్ సత్యం, మల్లేశం పాల్గొన్నారు.