14-03-2025 12:50:00 AM
యాసంగి పంట కొనుగోలుపై అధికారులతో రివ్యూ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, మార్చి 13(విజయక్రాంతి): యాసంగి మార్కెటింగ్ సీజన్ లో నిర్దేశించిన నాణ్యత ప్రమాణాలను తూచా తప్పకుండా పాటిస్తూ మద్దతు ధర పై వరి పంట కొనుగోలుకు సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ డి.వేణు లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ యాసంగి మార్కెటింగ్ సీజన్ 2024-25 లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు నాణ్యమైన వడ్లను మద్దతు ధరపై కొనుగోలు చేసి 48 గంటల్లో చెల్లింపులు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని, పెద్దపల్లి జిల్లాలో 4.5 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని, దీనికి తగ్గట్టుగానే అవసరమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు.
కొనుగోలు కేంద్రాల జాబితా, ఇంచార్జిలను ఫైనల్ చేసి మార్చి 3వ వారంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన టార్ఫాలిన్, తేమ యంత్రాలు, వెయింగ్ యంత్రాలు గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచొలని, రైస్ మిల్లులో ఎట్టి పరిస్థితుల్లోనూ తాలు కట్ చేయడానికి వీలు లేదని, నాణ్యతను కొనుగోలు కేంద్రాల దగ్గరే పరిశీలించి పంపాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద, రైస్ మిల్లుల వద్ద ఎక్కడ హమాలీల కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలోజిల్లా డీఎం మార్కెటింగ్ శ్రీకాంత్ , మార్కెటింగ్ అధికారి ప్రవీణ్, జిల్లా సహకార అధికారి శ్రీమాల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆదిరెడ్డి, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి రాజేందర్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.