24 March, 2026 | 3:30 PM

నీరజ్@89.49

24-08-2024 12:30 AM
  1. లుసాన్నే మీట్‌లో రెండో స్థానం 
  2. సీజన్ బెస్ట్‌తో మెరిసిన స్టార్ అథ్లెట్ 
  3. సెప్టెంబర్ 14న డైమండ్ లీగ్ ఫైనల్

లుసాన్నే: పారిస్ ఒలింపిక్స్ ప్రదర్శన మరువకముందే భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా మరో అత్యుత్తమ ప్రదర్శనతో మెరిశాడు. లుసాన్నే డైమండ్ లీగ్ మీట్‌లో జావెలిన్‌ను 89.49 మీటర్లు విసిరిన నీరజ్ రెండో స్థానంలో నిలిచాడు. ఒలింపిక్స్‌లో జావెలిన్ త్రో ఫైనల్లో నీరజ్ 89.45 మీటర్లు విసిరి రజతం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఒలింపిక్ రికార్డును సవరిస్తూ మరో 4 సెమీ ఎక్కువగా వేసిన నీరజ్ సీజన్ బెస్ట్ త్రో నమోదు చేసుకున్నాడు.

ఇక పారిస్ క్రీడల్లో కాంస్యం నెగ్గిన గ్రెనెడా అథ్లెట్ పీటర్స్ అండర్సన్ 90.61 మీటర్లతో తొలి స్థానంలో నిలవగా.. జర్మనీ అథ్లెట్ జులియన్ వెబెర్ 87.08 మీటర్లతో మూడో స్థానం దక్కించుకున్నాడు. లుసాన్నే ప్రదర్శనతో 7 పాయింట్లు ఖాతాలో వేసుకున్న నీరజ్.. జులియన్ వెబర్‌తో కలిసి 14 పాయింట్లతో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. 21 పాయింట్లతో ఎవరికి అందనంత ఎత్తులో ఉన్న పీటర్స్ అండ ర్సన్  తొలి స్థానంలో ఉండగా.. 16 పాయింట్లతో జాకుబ్ వద్లెక్ రెండో స్థానంలో ఉన్నాడు. సెప్టెంబర్ 14న జరగనున్న బ్రస్సెల్స్ డైమండ్ మీట్ ఫైనల్లో టాప్ ప్లేయర్లు తలపడనున్నారు. అంతకముందు సెప్టెంబర్ 5న జ్యురిచ్ డైమండ్ లీగ్ జరగనుంది.

నెమ్మదిగా ఆరంభించి..

లుసాన్నే డైమండ్ మీట్‌లో మంచి ఆత్మవిశ్వాసంతో కనిపించిన నీరజ్ చోప్రా తన గేమ్‌ను కాస్త నెమ్మదిగానే ఆరంభించాడు. పోటీలో మొత్తం 10 మంది అథ్లెట్లు బరిలోకి దిగగా.. ఒక్కొక్కరికి ఆరు అవకాశాలు ఇచ్చారు. నీరజ్ తన మొదటి నాలుగు త్రోలను 85 మీ లోపే విసరడం గమనార్హం.  ఐదో ప్రయత్నంలో జావెలిన్‌ను 85.58 మీటర్లు విసిరి మూడో స్థానానికి ఎగబాకాడు. అప్పటిదాకా తన బలాన్ని దాచుకున్న నీరజ్ అసలైన ఆటను ఆఖరి త్రోలో చూపించాడు.

తన శక్తినంతా కూడదీసుకొని జావెలిన్‌ను 89.49 మీటర్ల దూరం విసిరి రెండో స్థానానికి దూసుకొచ్చాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఒక్కసారి మాత్రమే సరైన త్రో వేసిన నీరజ్ ఈసారి మాత్రం ఒక్క ఫౌల్ నమోదు చేయకపోవడం విశేషం. నీరజ్ కెరీర్‌లో లుసాన్నే ప్రదర్శన రెండో అత్యుత్తమం కాగా.. 2022 స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్ మీట్‌లో 89.94 మీటర్లు విసిరి రికార్డులకెక్కాడు.

మొదట నా ప్రదర్శనపై కాస్త అసంతృప్తికి లోనయ్యా. కానీ చివరి ప్రయత్నంలో కెరీర్ రెండో అత్యుత్తమం నమోదు చేయడం సంతోషంగా అనిపించింది. పారిస్ అనంతరం ఇది 

మంచి కమ్‌బ్యాక్.

 నీరజ్ చోప్రా