నీట్‌పై సుప్రీంకోర్టు జడ్జితో దర్యాప్తు చేయాలి
- ఎస్‌ఎఫ్‌ఐ నాయకుల డిమాండ్
సుందరయ్య పార్కు వద్ద ర్యాలీ
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు న్యాయమూర్తితో సమగ్రమైన దర్యాప్తు జరపాలని, ఎన్‌టీఏను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, ప్రధాన కార్యదర్శి టి.నాగరాజు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం బాగ్‌లింగంపల్లి సుందరయ్య పార్కు వద్ద విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నీట్ పరీక్ష గందరగోళంపై గ్రేస్ మార్కులు రద్దు చేసి, ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహించి, 30న ఫలితాలు వెల్లడిస్తామని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పడం సరైంది కాదన్నారు.
రీఎగ్జామ్ జరపడం వలన ర్యాంకులు తారుమారవుతాయన్నారు. విద్యార్థుల అనుమానాలను నివృత్తి చేయని ఎన్‌టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే నీట్‌లో టాప్ ర్యాంకులు రావడం, పేపర్ లీకేజీ ఆరోపణలు ఉన్నాయన్నారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు నేతృత్వంలో తక్షణమే విచారణ జరిపించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు దామెర కిరణ్, మమత, వీరభద్రం, కె.అశోక్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య, లెనిన్ గువేరా, మందా శ్రీకాంత్, యార ప్రశాంత్, తారాసింగ్, జె.రమేష్, విఘ్నేష్, వినోద్, అరవింద్, శ్రీజ పాల్గొన్నారు.






