వర్షాలకు నీరు నిల్వకుండా చర్యలు
- జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖతో కలిసి కంట్రోల్ రూం ఏర్పాటు
నేటి నుంచి ‘డయల్ యువర్ ఎండీ’ పునః ప్రారంభం
జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (విజయక్రాంతి): భారీ వర్షాలు కురిసినా నగరంలో చినుకు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నట్లు జలమండలి ఎండీ సుదర్శన్ రెడ్డి తెలిపారు. నేటి (శనివారం) నుంచి ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తున్నామని చెప్పారు. వాన కాలం సందర్భంగా నగరంలో నీళ్లు ఎక్కువగా నిల్వ ఉండే 125 హాట్‌స్పాట్లను గుర్తించినట్లు చెప్పారు. ఈ మేరకు శుక్రవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీస్ శాఖ, జలమండలి సంయుక్త ఆధ్వర్యంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నీళ్లు ఎక్కువగా నిలిచే హాట్‌స్పాట్లను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించబోతున్నట్లు చెప్పారు. నీటిని ఎప్పటికప్పుడు తొలగించడానికి 16 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. 225 ఎయిర్‌టెక్ మెషిన్లతో మ్యాన్‌హోల్స్‌లోని సిల్ట్‌ను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నట్లు చెప్పారు. నగరవాసులు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నంబర్ 155313కి కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని వివరించారు.
నేటి నుంచి ‘డయల్ యువర్ ఎండీ’..
గతంలో ప్రతి నెల మూడో శనివారం నిర్వహించిన ‘డయల్ యువర్ ఎండీ’ కార్యక్రమాన్ని కోవిడ్ కారణంగా వాయిదా వేసినట్లు చెప్పారు. నేటి(శనివారం) నుంచి ప్రతీ పదిహేను రోజులకోసారి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అలాగే ప్రతి సోమవారం ప్రజావాణి (గ్రీవెన్స్ సెల్) కూడా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. నగరవాసులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించారు. ఫిర్యాదుదారులు 040 881, 040 040 3 నంబర్లకు ఫోన్ చేసి తమ సమస్యసు నివేదించవచ్చని పేర్కొన్నారు. నేటి సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు ఫిర్యాదుదారులు కాల్ చేసి నేరుగా ఎండీకి సమస్యలను తెలపవచ్చని వివరించారు.






