నీట్‌పై సీబీఐతో విచారణ జరిపించాలి
పరీక్షల నిర్వహణలో కేంద్రం విఫలం
- రాష్ట్రంలో త్వరలోనే జాబ్ క్యాలెండర్
- గ్రూప్-1లో 1:100పై చర్చించి నిర్ణయం
- రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి): నీట్ పరీక్ష నిర్వహణలో ఎన్డీయే సర్కార్ పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు ఆరోపించారు. నీట్‌పై నమ్మకం కలిగించేలా వ్యవహారించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. నీట్‌లో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎల్పీ కార్యాలయంలో ప్రభుత్వ విప్‌లు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, మక్కాన్‌సింగ్ ఠాకూర్‌తో కలిసి గురువారం మీడియాతో మాట్లాడుతూ.. నీట్ నిర్వహణ, ఫలితాల్లో చాలా మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని, దీనిపై కేంద్రం స్పందించి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఫిబ్రవరి 9 నుంచి నెల రోజుల పాటు దరఖాస్తులకు అనుమతించిన కేంద్రం.. మరో వారం రోజుల వరకు దరఖాస్తు గడువు పొడగించారని, కొన్ని రాష్ట్రాల్లో పరీక్ష కంటే ముందే కొన్ని ఘటనలు జరిగాయని మంత్రి ఆరోపించారు. జూన్ 14న ఫలితాలు రావాల్సి ఉండగా, జూన్ 4న ఇచ్చారని తెలిపారు. 63 మంది విద్యార్థులకు ఒకే ర్యాంకు రావడం, గ్రేస్ మార్కులు కలపడంపై మరింత అనుమానాలకు దారి తీసిందని, అందుకే విద్యార్థులు, అనేక సంఘాలు ఆందోళన చేస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు తెలిపారు.
జీవో 46పై త్వరలోనే సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, ఎలాంటి న్యాయపరమైన సమస్యలు రావద్దని జాగ్రత్తగా ఉద్యోగ నియామక ప్రక్రియ చేపడుతామన్నారు. గ్రూప్ 3 పోస్టులు పెంచాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తుందని, కానీ గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఐదున్నర లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో పాత నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయని, అందుకే పాత నోటిఫికేషన్ ప్రకారమే గ్రూప్ 2, 3 పరీక్షల నిర్వహణకు సిద్ధమయ్యామని మంత్రి పేర్కొన్నారు. కొత్తగా ఏర్పడబోయే ఖాళీలను గుర్తించి వాటిని త్వరలోనే భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ విషయంలో 1:50 నిష్పత్తికి బదులుగా 1:100 ప్రతిపాదికన ఎంపిక చేయాలని నిరుద్యోగులు అడుగుతున్నారని, దానిపై చర్చించిన నిర్ణయం తీసుకుంటామన్నారు.
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేయమని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెబుతున్నారని, కానీ ప్రైవేట్ వ్యక్తులకు సింగరేణిని కట్టబెట్టే పనిలో కేంద్ర ప్రభుత్వం ఉందని మంత్రి ఆరోపించారు. సింగరేణి ద్వారానే కొత్త బొగ్గు గనులను ఏర్పాటు చేయాలన్నారు. బొగ్గు నిక్షేప సంస్థలన్ని లాభాల్లోనే ఉన్నాయని శ్రీధర్‌బాబు వివరించారు. కార్మికుల నైపుణ్యంతోనే ఆ సంస్థ బలంగా ఉందన్నారు.
ఇదే అంశంపై ప్రధానమంత్రి మోదీతో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతారని తెలిపారు. సింగరేణిపై బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలను గుర్తు చేసుకోవాలని, లేదంటే ఆ పార్టీకి భవిష్యత్‌లో ఒక్క సీటు కూడా రాదన్నారు. శాంతిభద్రతల విషయంలో ప్రభుత్వం అలర్ట్‌గానే ఉందని, ఎవరు విఘాతం కలిగించినా సహించేది లేదని శ్రీధర్‌బాబు హెచ్చరించారు. తెలంగాణ ప్రజల కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారని, వారి ఆలోచనల మేరకే పాలన సాగుతోందని పేర్కొన్నారు. ఏపీలోని టీడీపీ ప్రభుత్వాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. టీడీపీని బీఆర్‌ఎస్ పార్టీనే ఫాలో అవుతుందని విమర్శించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలు జరిగాయని, తమ ప్రభుత్వం వాటికి ఆస్కారం ఉండదన్నారు.
నీట్ అక్రమాలపై ర్యాలీ..
నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు గాంధీభవన్ నుంచి ర్యాలీ ప్రారంభమై ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, యువకులు, కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. నీట్ పేపర్‌లోని అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.






