సంక్షేమ పథకాలకు పెద్దపీట!
- ఫుల్‌బడ్జెట్‌లో అన్నింటికీ కేటాయింపులు పెంపు
40 నుంచి 45శాతం వరకు నిధులు పెంచనున్న ప్రభుత్వం
ఓటాన్ అకౌంట్‌లో విస్మరించిన వాటికీ సర్దుబాటు
పూర్తిస్థాయి పద్దుపై తెలంగాణ ఆర్థికశాఖ కసరత్తు
హైదరాబాద్, జూన్ 20 (విజయక్రాంతి) : సంక్షేమ పథకాలకు పెద్దపీట వేసే లక్ష్యంతో ఆర్థికశాఖ 2024 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది. నిరుటి డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టింది. అందులో పూర్తిస్థాయిలో కేటాయింపులు జరగలేదు. ఈ నేపథ్యంలో వచ్చే నెల చివరి వారంలో ప్రవేశపెట్టనున్న ఫుల్ బడ్జెట్‌లో అన్ని పథకాలకు నిధులను పూర్తిస్థాయి లో కేటాయించే పనిలో ఆర్థికశాఖ నిమగ్నమైంది. గురువారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు నేతృత్వంలో సమీక్ష జరిగింది. కేటాయింపులపై కీలక చర్చ జరిగినట్లు అధికారవర్గాలు తెలిపాయి.
8నెలల సమగ్ర ఆర్థిక నివేదిక
రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు జూలై 31తో ముగుస్తుంది. దీంతో 2024 ఆర్థిక సంవత్సరంలో తదుపరి 8నెలల కోసం సర్కారు పూర్తిస్థాయి బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్ట నుంది. అయితే ఈ ౮ నెలల బడ్జెట్‌లో నిధుల కేటాయింపు విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సంక్షేమ పథకాలకు బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. ఆ తర్వాత ప్రాధాన్యత డెవలప్‌మెంట్, సేవల రంగాలకు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలిసింది.
ఏదీ వదలకుండా..
ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఆరు గ్యారంటీలకు ప్రభుత్వం రూ.53,196కోట్లను ప్రభుత్వం కేటాయించింది. మహిళకు రూ.2000, ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, రూ.500 గ్యాస్ సిలిండర్, రైతులు, కౌలు రైతులకు ఏటా రూ.15వేల సాయం, వ్యవసాయ కూలీలకు రూ.12వేల భరోసా, క్వింటాల్ వరికి రూ.500 బోనస్, ప్రతి ఇంటికి 200 ఉచిత విద్యుత్, ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల ఆర్థికసాయం, యువ వికాసం కింద విద్యార్థులకు రూ.5లక్షలు, చేయూత కింద రూ.4వేల పింఛన్ ఇస్తామని ఎన్నికల సమంయలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. వీటికి తోడు రైతు రుణమాఫీ. ఇవన్ని హామీలను రూ.53,196కోట్లతో అమలు చేయడం అసాధ్యం. అందుకే ఫుల్ బడ్జెట్‌లో గ్యారంటీ వారీగా నిధులను కేటాయించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో కొన్ని హామీలపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. యువ వికాసం పథకం కోసం యువత ఆసక్తిగా ఎదురు చేస్తోంది. ఫుల్ బడ్జెట్‌లో ఈ పథకానికి ప్రత్యేక కేటాయింపులు ఉండే అవకాశం ఉంది.
అంచనాల సవరింపు
సంక్షేమ పథకాల కేటాయింపులను పూర్తిస్థాయి బడ్జెట్‌లో ప్రభుత్వం భారీ స్థాయిలో సవరిస్తుంది. మొదట్లో ప్రభుత్వం అనుకున్న లబ్ధిదారుల సంఖ్య ఒకటైతే.. ప్రజాపాలన దరఖాస్తుల తర్వాత ఆ సంఖ్య డబుల్ అయ్యింది. అందుకే ఓటాన్ అకౌంట్‌లో సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధుల కంటే.. దాదాపు 45శాతం పెంచే యోచనలో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు ఆరు గ్యారంటీలను అమలు చేస్తే ఎంత ఖర్చు అవుతుంది? కొత్త రేషన్ కార్డులు మంజూరు అయ్యాక కొత్తగా ఎంతమంది లబ్ధిదారులు వచ్చి చేరుతారు? ఇలా ప్రతి అంశాన్ని క్షణ్ణంగా పరిశీలించి.. దూరదృష్టితో ఆర్థికశాఖ బడ్జెట్‌ను సిద్ధం చేస్తోంది.






