నిర్లక్ష్యానికి గురికా‘బడి’!
సర్కార్ బడులు.. పేదింటి విద్యార్థుల పాలిట సరస్వతి నిలయాలు.. తల్లిదండ్రుల పాలిట ఆశాజ్యోతులు.. అలాంటి స్కూళ్లు అరకొర సిబ్బంది, వసతులతో బుధవారం పునః ప్రారం భం కానున్నాయి. గత ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ పేరుతో రూ.కోట్లు వెచ్చించి చేపట్టిన పనులు ఇప్పటికీ పూర్తి కాలేదు. మండల స్థాయిలో ఎంఈవో పోస్టుల భర్తీ సమస్య కూడా వేధిస్తున్నది. పారిశుధ్య పనులు చేస్తూ, సహాయకులుగా పని చేసిన స్కావెంజర్లను విధుల్లో నుంచి గత ప్రభుత్వం తీసివేసింది. కొత్త ప్రభుత్వమైనా సమస్యలను పరిష్కరిస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు.
సమస్యలకు నెలవులు.. సర్కారు బడులు
అసంపూర్తిగా ‘మన ఊరుఔ మన బడి’ పనులు
రాష్ట్రవ్యాప్తంగా వేధిస్తున్న ఎంఈవోల సమస్య
మొత్తం 615 పోస్టుల్లో 488 మంది మాత్రమే విధులు
వీరిలో 17 మంది మాత్రమే రెగ్యులర్ ఎంఈవోలు
పారిశుద్ధ్య నిర్వహణకు స్కావెంజర్లు ఏరీ?
వారిని విధుల్లో నుంచి తొలగించిన గత ప్రభుత్వం
బడులు పునఃప్రారంభమైనా సమస్యలకు పరిష్కారమేదీ?
కామారెడ్డి, జూన్ 11 (విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా సర్కార్ బడులు అరకొర వసతులతో కునారిల్లుతున్నాయి. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 1,106 పాఠశాలలు ఉన్నాయి. రాష్ట్రప్రభుత్వం ప్రస్తుతం అమ్మ ఆదర్శ పాఠశాలల పేరుతో మరమ్మతులు ప్రారంభించింది. కనీసం వాటి తుది తేలలేదు. పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పనులపై పర్యవేక్షణ కొరవడింది.
కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిది ద్దుతామని ఏ ప్రభుత్వమొచ్చినా చెప్పడం తప్ప, ఆచరణలో అది సాధ్యం కావడం లేదు. స్కావెంజర్(అటెండర్), వాచ్‌మెన్స్ నియామకాలు లేనే లేవు. ప్రతి జిల్లాను ఎంఈవోల కొరత సమస్య వేధిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన పిల్లలు చదివే సర్కార్ పాఠశాలల్లో వసతి కల్పన ఘోరంగా ఉండడంపై విద్యావేత్తలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధ్యాయుల కొరతను సాకు గా చూపి గత ఏడాది ఒక్క కామారెడ్డి జిల్లాలోనే 110 పాఠశాలలు మూతపడ్డాయి.
గాంధారి మండలం రామలక్ష్మణ్‌పల్లిలో ప్రాథమిక పాఠశాల ఇప్పటికీ శిథిలావస్థలో ఉన్నాయి. ఇలాంటి శిథిలావస్థలో ఉన్న స్కూళ్లు జిల్లావ్యాప్తంగా 182 ఉన్నాయంటే రాష్ట్రవ్యాప్తంగా ఇంకెన్ని ఉంటాయో ఊహించవచ్చు. అలాగే గత ప్రభుత్వం ‘మన ఊరున మన బడి’ పథకంలో భాగంగా రూ.20 కోట్లతో కాంట్రాక్టర్లు చేపట్టిన పనులకు బిల్లులు విడుదల కావాల్సి ఉన్నది. కొత్త ప్రభుత్వం వచ్చాక ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ కింద రూ.3 కోట్ల పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులకూ కాంట్రాక్టర్లకు నిధులు విడుదల కావాల్సి ఉన్నది.
బడి గంట కొట్టేదెవరు?
నిర్మల్, జూన్11 (విజయక్రాంతి): విద్యాసంస్థల్లో మంగళవారం నుంచి బడి గంట మోగనున్నది. విద్య సంవత్సరం ప్రారంభం కానున్నది. కానీ రాష్ట్రప్రభుత్వం మాత్రం అందుకు తగిన విధంగా ఏర్పాట్లు చేయలేదు. బడుగు బలహీన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కార్ బడుల్లో స్కావెంజర్స్ (అటెండర్స్)ను నియమించకపోవడం, కనీసం ఇప్పటివరకు నియా మకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం శోచనీయం.
ఉదాహరణకు నిర్మల్ జిల్లా పరిధిలోని 18 మండలాలతో పాటు నిర్మల్, ఖానాపూర్, భైంసా మున్సిపాలిటీల పరధిలో మొత్తం 735 ప్రభుత్వ పాఠశాల లు ఉండగా, వీటిలో ప్రాథమిక పాఠశాలలు 535, ప్రాథమికోన్నత పాఠశాలలు 85 , ఉన్నత పాఠశాలలు 115. వీటి పరిధిలో మొత్తం 62 వేల మంది విద్యార్థులు తెలు గు, ఆంగ్లం, ఉర్దూ, మరాఠీ మాధ్యమాల్లో చదువుకుంటున్నారు. ఇంతమంది చదువుకుంటున్న పాఠశాలల్లో శుచీ శుభ్రత అవస రం. అందుకు బడి సహాయకుల సేవలు అత్యవసరం.
వీరి పని ప్రాథమికంగా పిల్లలకు తాగునీటి వసతి కల్పించడం, బడి తాళం తీయడం, ముగిశాక తిరిగి తాళం వేయడం, గంట కొట్టడం. వీరిని రాష్ట్రప్రభుత్వమే కాంట్రాక్టర్ పద్ధతిన నియమించేది. ఇలా జిల్లావ్యాప్తంగా 400 మందికి పైగా పని చేసేవారు. అనుభవాన్ని బట్టి వారికి నెలకు రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు గౌరవ వేతనం అందేది. సహాయకులు వారి కి కేటాయించిన పనులు మాత్రమే కాకుం డా అదనపు పనులు చేస్తున్నా, గత ప్రభుత్వం వీరిని విధుల నుంచి తొలగించిం ది. ఒకవైపు వారంతా తమ కొలువులను క్రమబద్ధీకరించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతుంటే వారిని తొలగించడం ఆవేదనకు గురిచేసింది.
కొత్త సర్కార్ పైనే ఆశలు..
తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యకు ప్రాధాన్యమిస్తామని, సర్కార్ బడు ల్లో స్కావెంజర్స్‌ను నియమిస్తామని నాడు కాంగ్రెస్ నేతలు హామీలు ఇచ్చారు. అనుకున్నట్లుగానే ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది. కొత్తగా విద్యాసంవత్సరమూ ప్రారంభమవుతున్నది. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని గతంలో పనిచేసిన స్కావెంజర్లు కోరుతున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బంది మూడు, నాలుగు రోజులకోసారి బడులను శుభ్రం చేస్తుండడంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుంటున్నది.
గ్రామస్తులు చందాలు వేసుకున్నా, దాతలు సహ కరించినా ప్రైవేటు వ్యక్తులతోనే పని చేయిస్తుండటం, అది కూడా సక్రమంగా జరగక పోవడంతో విద్యాకమిటీలు విసిగి వేసారిపోతున్నాయి. స్కావెంజర్లను నియమిస్తే బడుల్లో వస్తువులకు భద్రత ఉంటుందని, బడి కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులు అభిప్రాయ డపడుతున్నారు. ఇక సింగిల్ టీచర్ పాఠశాలల్లో అయితే, ఆ టీచరే అన్ని పనులు చేసుకోవాల్సిన దుస్థితి. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం స్పందించి స్కావెంజర్లను నియ మించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
మండల ‘మిథ్యా’శాఖ అధికారి!
భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 1౧ (విజయక్రాంతి): విద్యారంగంలో ప్రభుత్వం నిర్దేశించిన సరికొత్త సంస్కరణలు అమ లు చేయాలన్నా.. ప్రభుత్వ సదుపాయా లు విద్యార్థులకు అందాలన్నా.. సిబ్బందికి సక్రమంగా వేతనాలు అందాలన్నా.. పాఠశాలల్లో తరగతుల నిర్వహణ నిబంధనల ప్రకారం నడవాలన్నా.. మండల స్థాయిలో ఎంఈవోల పాత్ర ఎంతో కీల కం. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నా ఎంఈవో వ్యవస్థను విస్మరించడం, ప్రతి మండలానికి ఒక ఎంఈవోలను నియమించకపోవడంతో విద్యాశాఖ ఆశించిన ఫలితాలు రావడం లేదనేది వాస్తవం. ఎంఈవోలు లేని మండలాల్లో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులే అదనపు బాధ్యతలు నిర్వర్తించడం శోచనీ యం. బుధవారం నుంచి విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వెంటనే ఎంఈవో పోస్టులను పర్మినెంట్ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన అవసరం ఉన్నది.
ఉదాహరణకు భద్రాద్రి జిల్లాలో..
భద్రాద్రి జిల్లాకు పర్మినెంట్‌గా డీఈవోను నియమించకుండా విద్యాశాఖ ఖమ్మం డీఈవో కార్యాలయంలో ఏడీఏగా విధులు నిర్వహిస్తున్న ఎం.వెంకటే శ్వర చారికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ప్రతి మండలానికి ఒక ఎంఈ వోను నియమించాల్సి ఉండగా జిల్లాలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని 23 మండలాలకు ప్రస్తుతం 10 మంది ఎంఈవోలు మాత్రమే నియమితులై విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికే మిగతా మండలాల అదనపు బాధ్యతలను అప్పగించడం గమనార్హం. కొత్తగూడేన్ని విద్యాశాఖ నాలుగు మండలాలుగా విభజించి, ఆ నాలుగు మండలాలకు ఒకే ఎంఈవోను నియమించింది. ఈయనకే మళ్లీ చర్ల మండలాన్నీ అప్పగించింది. దీంతో ఈ ఎంఈవో ఐదు మండలాల బాధ్యతలు చూస్తున్నారు.
488 మంది ఎంఈవోలే
రాష్ట్రవ్యాప్తంగా 615 మండలాలు ఉండగా, వీటి పరిధిలో 615 మంది ఎంఈవోలు విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. కానీ ప్రస్తుతం యావత్ రాష్ట్రంలో కేవలం 488 మంది ఎంఈవోలే పనిచేస్తున్నారు. వీరిలోనూ 17 మంది రెగ్యు లర్ ఎంఈవోలు కాగా, మిగిలిన 417 మంది ఎంఈవోలూ అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. దీంతో పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడిం ది. కొన్నిచోట్ల ఒక్క ఎంఈవో ఎనిమిది మండలాల బాధ్యతలను నిర్వ ర్తించడం విస్తుపోయే విషయం. ఎంఈవో వ్యవస్థను గాడిలో పెట్టడం ఎంతో అవసరం.
హమీని నిలబెట్టుకోవాలి..
జిల్లావ్యాప్తంగా 400 మంది స్కావెంజర్లు బడుల్లో చాకిరీ చేసి నం. రోజూ పొద్దున్నే బడికి వెళ్లేవాళ్లం. తాళం తీసి చెత్తా ఊడ్చేవాళ్లం. పిల్లల కోసం మంచినీరు అందుబాటులో ఉంచేవాళ్లం. బడి గంట కొట్టేవాళ్లం. చెత్తా చెదారం శుభ్రం చేసే వాళ్లం. అన్ని పనులు చేసినా మాకు అందే జీతం అంతంతమాత్రం. అవి కూడా ఎప్పుడు ఇస్తరో తెల్వదు. సేవలను గుర్తించకపోగా మమ్మల్ని పని నుంచి తీసేశారు.
శ్రావణ్ స్కావెంజర్, కడెం, నిర్మల్ జిల్లా
చాలా ఇబ్బందులు పడుతున్నాం..
పాఠశాలలో స్కావెంజర్లు లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో పనిచేసిన వారిని గత ప్రభుత్వం తొలగించింది. వారికి ఇచ్చే వేతనం అతి తక్కువ అయినప్పటికీ, వారిపై కనికరం చూపలేదు. ప్రస్తుతం బడులు ప్రారంభమయ్యాయి. పంచాయతీ పారిశుధ్య సిబ్బందితోనే పారిశుధ్య పనులు చేయించుకుంటున్నాం. ప్రభుత్వం వెంటనే స్కావెంజర్లనే మళ్లీ నియమిస్తే వారికి మేలు జరుగుతుంది.
రవికాంత్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్






