3 September, 2026 | 6:30 AM

ముస్తాబాద్ అభివృద్ధికి పాలకుల నిర్లక్ష్యం.?

03-09-2026 | 03:30am
  1. ముస్తాబాద్ -దుబ్బాక రోడ్డు గుంతలమయం
  2. డిగ్రీ కళాశాల కోసం విద్యార్థుల నిరీక్షణ 
  3. అధికారుల అలసత్వం లేకపోలేదు ?
  4. నాయకుల మధ్య సమన్వయ లోపం?
  5. పార్టీలకతీతంగా అభివృద్ధి చేసుకోవాలి

ముస్తాబాద్, సెప్టెంబర్ 2 (విజయక్రాంతి): ఒకప్పుడు ఉద్యమాలకు అడ్డాగా ముస్తాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ కేంద్రంగా ఉండేది. నేడు నాయకుల సమన్వయ లోపం వల్ల వెనుకబడిందనే విమర్శలు ప్రజల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District)లో మండల కేంద్రమైన ముస్తాబాద్ లో ప్రజలకు అవసరమైన పలు మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా ఉ న్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు మండలంలో డిగ్రీ కళాశాల లేకపో వడంతో సిరిసిల్ల,దుబ్బాక,సిద్దిపేట తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక దుబ్బాకముస్తాబాద్ డబుల్ రోడ్డు పనులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది.పనుల జాప్యం వల్ల ప్రజలు నిత్యం ఇబ్బందులు పడుతుండగా, కచ్చా రోడ్డుపైనే ప్రయాణాలు చేయాల్సి వస్తోందని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముస్తాబాద్ అభివృద్ధి కోసం గతంలో ఎన్నో పోరాటాలు జరిగినప్పటికీ, ఆ స్థాయికి తగిన గుర్తింపు,ప్రభుత్వ ప్రాధాన్యం లభించలేదని స్థానికులు అంటున్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్య, రవాణా, మౌలిక సదుపాయాలపై ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు. ‘మండల కేంద్రంగా ఉన్న ముస్తాబాద్కు డిగ్రీ కళాశాల ఎప్పుడు వస్తుంది? డబుల్ రోడ్డు ఎప్పుడు పూర్తవుతుంది? కచ్చా రోడ్ల కష్టాలు ఎప్పుడు తీరతాయి?‘ అనే ప్రశ్నలు ప్రజల్లో బలంగా వినిపిస్తున్నాయి.

బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశారు

ముస్తాబాద్ నుండి దుబ్బాక రోడ్డు విస్తరణ పనులకు గత బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో 14 కోట్లతో నిధులు మంజూరై అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అదే సమయంలో ప్రభుత్వం మారింది. ముస్తాబాద్ మండలానికి సంక్షేమ నిధులను ఇతర మండలానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేరవేసుకుంది. ఇప్పటికైనా స్థానిక నాయకులు ముస్తాబాద్ దుబ్బాక డబుల్ రోడ్డు చిరకాల కోరికను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

కోడె శ్రీనివాస్, బిఆర్‌ఎస్ పార్టీ నాయకుడు

డిగ్రీ కళాశాల మంజూరుకై 15 సం‘ పోరాటం 

15 సంవత్సరాల సుదీర్ఘ పోరాటానికి ముస్తాబాద్ మండల కేంద్రానికి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని కోటి ఆశలతో విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. కళాశాల కోసం నిరసనలు ధర్నాలు చేసినప్పటికీ కరపత్రాలు ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదు. డిగ్రీ కళాశాలకు అనుకూల ప్రదేశం కూడా ఉందన్నారు.ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి డిగ్రీ కళాశాల మంజూరు చేయాలని విద్యార్థుల కోరిక నెరవేర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

సామాజిక ఉద్యమ నాయకుడు చింతోజు బాలయ్య