మేడ్చల్ లో అక్రమ నిర్మాణాల జోరు
అనుమతి ఒకలా.. నిర్మాణాలు మరోలా..!
- రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద అనుమతి లేకుండా షట్టర్ల నిర్మాణం
- జాతీయ రహదారిపై నీటి ప్రవాహానికి అడ్డంగా భారీ కాంప్లెక్స్
- పట్టించుకోని అధికారులు
మేడ్చల్, సెప్టెంబర్ 2 (విజయ క్రాంతి): మేడ్చల్ పట్టణంలో అక్రమ నిర్మాణాలు (Illegal constructions) జోరుగా సాగుతున్నాయి. కొన్నింటికి ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిర్మాణాలు పూర్తి చేస్తుండగా, మరికొన్ని భవనాలకు జి ప్లస్ రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని ఆ పైన అదనంగా అంతస్తులు నిర్మిస్తున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పదుల సంఖ్యలో షెటర్లు నిర్మించారు. వీటికి ఎలాంటి అనుమతి లేదు. రిజిస్ట్రేషన్ కార్యాలయాన్ని ఇటీవల మండల పరిషత్ కార్యాలయానికి తరలించారు.
రిజిస్ట్రేషన్ కార్యాలయానికి క్రయ,విక్రయదారులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. డాక్యుమెంట్ రైటర్ లకు కార్యాలయాలు కావాలి. అంతేగాక జిరాక్స్ సెంటర్లు, హోటల్ లకు కూడా మడిగెలు అవసరం. వీటికి పెద్ద మొత్తంలో అద్దె వచ్చే అవకాశం ఉంది. దీంతో కొంతమంది ఆగమేఘాల మీద అనుమతి లేకుండా షట్టర్లు నిర్మించారు. వీటిపై మున్సిపల్ అధికారులకు అనేక ఫిర్యాదులు అందాయి. వీటి వెనుక మున్సిపల్ మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు ఉన్నారు. వీరి ఒత్తిడి మేరకు మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు.
ప్రహరీ కూల్చివేత విచారణ అటకెక్కినట్టేనా?
రిజిస్ట్రేషన్ కార్యాలయం ప్రహరీని ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేసి అక్కడ చిన్న గేటు ఏర్పాటు చేశారు. దీనిపై రిజిస్ట్రేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ కేసులో ఎలాంటి పురోగతి లేదు. ఇక్కడ గేటు ఏర్పాటు చేయడం వల్ల రాకపోకలతో కొందరికి లాభం జరుగుతుంది. ఎవరు కూల్చివేశారు, ఇక్కడ గేటు నిర్మించడం వల్ల ఎవరికి లాభం జరుగుతుందో అధికారులకు, అనధికారులకు అందరికీ తెలుసు. కానీ పోలీసులు దర్యాప్తు చేయడం లేదు.
అక్రమ నిర్మాణాలకు అడ్డా కేఎల్‌ఆర్
పట్టణంలోని కేఎల్‌ఆర్ వెంచర్ అక్రమ నిర్మాణాలకు అడ్డగా మారింది. ఇక్కడ బిల్డర్లు పెద్ద సంఖ్యలో ఇల్లు నిర్మిస్తున్నారు. ఒక ఇంటిని కూడా నిబంధనలకు అనుగుణంగా నిర్మించడం లేదు. ఒక్క ఇంటికి కూడా సెట్ బ్యాక్ లేదు. జి ప్లస్ రెండు అంతస్తులకు అనుమతి తీసుకొని మూడు, నాలుగు అంతస్తులు నిర్మిస్తున్నారు.
రెసిడెన్షియల్ పర్మిషన్ తీసుకొని కమర్షియల్ నిర్మిస్తున్నారు. అక్రమ నిర్మాణాలు జరుగుతున్నప్పటికీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. గచ్చిబౌలిలోని అంజయ్య నగర్ ఘటన తర్వాత సైబరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ అక్రమ నిర్మాణాలపై ఉక్కు పాదం మోపుతున్నారు. మేడ్చల్ పట్టణంపై కూడా దృష్టి పెట్టాలని స్థానికులు కోరుతున్నారు.
నీటి ప్రవాహానికి అడ్డంగా భారీ కాంప్లెక్స్
మేడ్చల్-చెక్ పోస్ట్ మధ్యలో చెరువు కట్ట కింద జాతీయ రహదారిని ఆనుకొని భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. పైనుంచి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంగా దీనిని నిర్మిస్తున్నారు. ఈ కాంప్లెక్స్ పనులు గత సంవత్సరం ప్రారంభమయ్యాయి. వర్షం కురిసిన సమయంలో నీరంతా రోడ్డు మీద ప్రవహించి ట్రాఫిక్ జామ్ అయింది. అదే సమయంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ హైదరాబాద్ వైపు వెళ్తూ ట్రాఫిక్ లో ఇరుక్కున్నారు. రంగనాథ వాహనం దిగి పరిస్థితిని పరిశీలించారు.
నీటి ప్రవాహానికి అడ్డంగా కాంప్లెక్స్ నిర్వహించడం వల్ల రోడ్డు కింద కల్వర్టు నుంచి మీరు వెళ్లలేక రోడ్డు మీద నుంచి నీరు ప్రవహిస్తున్నట్లు గుర్తించారు. ఈ భవన నిర్మాణం కొన్ని నెలలు ఆగిపోయింది. మళ్లీ ఇటీవల పనులు ప్రారంభమయ్యాయి. భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. ఇకనైనా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.






