6 March, 2026 | 2:55 AM

దేవాదాయ శాఖలో నిర్లక్ష్యం!

06-03-2026 01:25 AM

తాడ్‌బండ్ శ్రీవీరాంజనేయ స్వామి ఆలయ నిర్వహణపై ప్రైవేటు వ్యక్తుల పెత్తనం

బాధ్యతలను వ్యవస్థాపక కుటుంబ సభ్యులకు అప్పగించకుండా అధికారుల అడ్డు?

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి దేవాలయ పరిరక్షణ సమితి ఫిర్యాదు

హైదరాబాద్, మార్చి 5 (విజయక్రాంతి): దేవాదాయ శాఖలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రైవే టు వ్యక్తులకు పెత్తనం అప్పగిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినపడుతున్నాయి. తాడ్‌బండ్ శ్రీవీరాంజనేయ స్వామి దేవాలయానికి ఎంతో ఖ్యాతి ఉంది. అయితే ఈ దేవస్థానం నిర్వహణ బాధ్యతలను వ్యవస్థాపక కుటుంబ సభ్యులకు (ఎఫ్‌ఎప్‌ఎం) అప్ప గించకుండా దేవాదాయ శాఖలోని కొందరు అధికారులు అడ్డుపడుతున్నారని సదరు కుటుంబ సభ్యులు, భక్తులు ఆరోపిస్తున్నారు.

దీనిపై రాష్ట్ర దేవాలయ పరిరక్షణ సమితి అధ్యక్షుడు నాగిల్ల శ్రీనివాస్.. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీకి ఫిర్యాదు చేశారు. తాడ్‌బండ్ కుమ్మరిగూడ శ్రీవీరాంజనేయ స్వామి దేవస్థానానికి వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా బూరుగు వీరేశంను (ఎఫ్‌ఎఫ్‌ఎం) గుర్తిస్తూ 2000 సంవత్సరంలో జం ట నగరాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆయన ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ చేసేవారు.

అయితే తన అనారోగ్య కారణాల దృ ష్ట్యా ఆలయ నిర్వహణ చేయలేకపోతున్నానని పేర్కొంటూ 2021 ఫిబ్రవరి 26న దేవాదాయ శాఖ సెక్రెటరీకి లేఖ రాశారు. తన సతీమణి బూరుగు రమాదేవి, కుమారుడు బూరుగు సంతోష్‌కుమార్‌లను వ్యవస్థాపక కుటుంబ సభ్యులుగా గుర్తించాలని కోరారు. అలాగే అక్రమంగా కొనసాగుతున్న స్వయం ప్రకటిత కమిటీని రద్దుచేసి, వారికి ఆలయంలో ఎలాంటి పాత్ర లేదని స్పష్టంచేయా లని విజ్ఞప్తి చేశారు. అయి తే అప్పటి దేవాదాయ కమిషనర్ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కమిషనర్ స్వయం కమిటీ సభ్యులనే ప్రోత్సహించేలా చూశారనే ఆరోపణలు వచ్చాయి.

బూరుగు వీరేశం మరణాంతరం ఆయన కుమారుడు సంతోష్‌కుమార్ తన వారసత్వ హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ దేవాదాయ శాఖ కమిషనర్ పెండింగులో పెట్టా రు. అక్రమంగా ఏర్పడిన స్వయం ప్రకటిత కమిటీ ప్రలోభాలకు లోనైన అప్పటి కమిషనర్ ఆలయ ఆవరణలో చేపట్టిన అనధికార నిర్మాణాలకు అనుమతించారని, కమిషనర్ ఆలయానికి వచ్చినప్పుడల్లా.. ఆ అక్రమ కమిటీతోనే సమావేశాలు నిర్వహిస్తూ పక్షపాత వైఖరిని ప్రదర్శించారని ఆరోపణలు అప్పట్లోనే వచ్చాయి.

హైకోర్టు తీర్పు అమలేదీ?

హైఐకోర్టు తీర్పు ప్రకారం ఒకసారి వ్యవస్థాపక కుటుంబ సభ్యుడిగా గుర్తింపు పొందితే వారి వారసులకు ప్రతిసారీ ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. వారు సాధారణంగానే ఆ హోదాను పొందుతారని హైకోర్టు తీర్పు ఉంది. అయితే దేవాదాయ శాఖ ఈ చట్టపరమైన అంశాన్ని ఉద్దేశపూర్వకంగానే విస్మరించింది. ప్రభుత్వం ఈ ఆలయానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈవో), ట్రస్ట్ బోర్డ్ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ కమిషనర్ నిబంధనలకు విరుద్ధంగా ఒక ఈవోను నియమించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై ఏకంగా తెలంగాణ గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన తరువాతనే సదరు అక్రమ కమిటీ సభ్యుల అభ్యర్థనలను కమిషనర్ తిరస్కరించారు. అయినప్పటికీ.. అధికారుల అండదండలతో ఆ కమిటీ ఇంకా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూనే ఉం దని ఫిర్యాదులో పేర్కొన్నారు.   దేవాలయానికి బడ్జెట్ విడుదలను కూడా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంపై సీఐడీతో విచారణ చేయించి, దోషులపై చర్యలు తీసుకోవాలని నాగిల్ల శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదులో అభ్యర్థించారు. దీనితోపాటు మోండా మార్కెట్ లోని శ్రీమత్క నాగయ్య ధర్మశాల విషయం లో కూడా వారసత్వ హక్కులను గుర్తించకుండా దేవాదాయ శాఖ అధికారులు కావా లనే జాప్యం చేస్తున్నారని అక్కడకూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని, దానిపైనకూడా విచారణ చేయించి చర్యలు తీసు కోవాలని ఫిర్యాదుదారు రాసిన లేఖలో పేర్కొన్నారు.