అధికారుల నిర్లక్ష్యం.. అక్రమార్కులకు వరం
- కిష్టారెడ్డిపేటలో అక్రమాలకు కళ్ళెం వేసేదెవరు ?
- మున్సిపల్ అధికారుల చర్యలు శూన్యం
- మామూళ్ళు ఇస్తే కన్నెత్తి చూడని సిబ్బంది
సంగారెడ్డి, జూన్ 3 (విజయక్రాంతి): అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కిష్టారెడ్డిపేటలో నిబంధనల ఉల్లంఘనలు పరాకాష్టకు చేరాయి. ఎటువంటి అనుమతులు లేని బహుళ అంతస్తుల భవనాలు, ప్రమాదకరమైన సెల్లార్ల తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నప్పటికీ.. స్థానిక మున్సిపల్ టౌన్ ప్లా నింగ్, రెవెన్యూ అధికారులు మాత్రం ‘చర్యలు శూన్యం‘ అన్న చందంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి. హైడ్రా వంటి ఏజెన్సీలు హెచ్చరిస్తున్నా, క్షేత్రస్థాయిలో అక్రమార్కుల అండదండలతో యంత్రాంగం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని స్థానికులు మండిపడుతున్నారు.
నిబంధనలు బూడిదలో పోసిన పన్నీరే..
కిష్టారెడ్డిపేట పరిధిలో జీ ప్లస్ టు అంతస్తులకే అనుమతి తీసుకుని, ఏకంగా ఐదు నుండి ఆరు అంతస్తుల వరకు భారీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా భారీ సెల్లార్లను తవ్వుతున్నారు. చుట్టుపక్కల నివాసాల పునాదులు కదులుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పక్కనే ఉండే కాలనీల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీస రోడ్డు మార్గం, గాలి, వెలుతురుకు అవసరమైన సెట్బ్యాక్ స్థలాలు వదలకుండా భవనాలను ఒకదానికొకటి తాకేలా నిర్మిస్తున్నారు. రేపు ఏదైనా అగ్నిప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ కూడా వెళ్లే దారి లేదంటే ఇక్కడి పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అధికారుల అలసత్వం.. అక్రమార్కులకు వరం..
స్థానిక మున్సిపల్ అధికారుల కనుసన్నల్లోనే ఈ అక్రమ ధందా సాగుతోందని ప్రధాన ఆరోపణ. భవన నిర్మాణాల ప్రారంభంలోనే స్థానికులు ఫిర్యాదులు చేసినా, ‘చూస్తాం.. నోటీసులు ఇస్తాం‘ అంటూ కాలయాపన చేయడం, ఈలోగా బిల్డర్లు రాత్రికి రాత్రే స్లాబులు వేసేయడం నిత్యకృత్యంగా మారింది. కేవలం ఏదైనా పెద్ద ఆందోళన జరిగినప్పుడు మా త్రమే నామమాత్రంగా వచ్చి పనులు ఆపాలని చెప్పి వెళ్తున్నా రే తప్ప, నిర్మాణాత్మకమైన కూల్చివేతలు లేదా సీజ్ చేసిన దా ఖలాలు లేవని స్థానిక ప్రజలు వాపోతున్నారు.
మరోవైపు ప క్కనే ఉన్న ప్రైవేట్ సర్వే నంబర్ల డాక్యుమెంట్లు చూపించి, వివాదాస్పద లేదా ప్రభుత్వ భూముల్లో అనుమతులు పొందుతూ రియల్ మోసాలకు బిల్డర్లు తెరలేపుతున్నారు. తక్కువ ధరకు ఫ్లాట్లు వస్తున్నాయని నమ్మి సామాన్య, మధ్యతరగతి ప్రజలు తమ జీవితకాల సంపాదనను పెట్టి ఇక్కడ కొనుగోలు చేసి చివరకు లబోదిబోమంటున్నారు.
ఇప్పటికైనా స్పందించేనా?
ప్రభుత్వం ప్రత్యేక విపత్తు నివారణా సంస్థల ద్వారా అక్రమ నిర్మాణాలపై కఠినంగా ఉంటామని చెప్తున్నా, కిష్టారెడ్డిపేట లాంటి ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన శూన్యంగా మారింది. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు, మున్సిపల్ కమిషనర్ ప్రత్యే క దృష్టి సారించి, కిష్టారెడ్డిపేటలోని అక్రమ బహుళ అంతస్తులను, నిబంధనల్లేని సెల్లార్లను సీజ్ చేసి కఠిన చర్యలు తీ సుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.






