గచ్చిబౌలిలో భారీ చోరీ.. ఇద్దరు నిందితులు అరెస్ట్
హైదరాబాద్: గచ్చిబౌలిలోని ఓ ఇంట్లో నేపాలీ గ్యాంగ్ భారీ స్థాయిలో చోరీ జరిగింది. సుమారుగా కిలో బంగారు ఆభరణాలు, వజ్రాలు అపహరించారు. వివరాల్లోకి వెళ్తే... నెల రోజుల క్రితం నేపాలీ దంపతులు గచ్చిబౌలిలోని హిల్ రిడ్జ్ విల్లాలో నివాసం ఉంటున్న ఓ వ్యాపారవేత్త ఇంట్లో పనిమనుషులుగా చేరారు. కొద్ది రోజుల క్రితం యజమానులు ముంబైకి వెళ్ళారు. ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాల్ దంపతులు ఇంట్లో కనిపించకపోయ్యేసరికి అనుమానం వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులను పరిశీలించారు. ఇంటి తాళాలు పగలగొట్టినట్లు ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో, ఆ పనివాళ్లు తమకు చెప్పకుండానే వెళ్లిపోయి ఉంటారని కుటుంబ సభ్యులు మొదట భావించారు.
అయితే, పూజ గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసు కనిపించకపోవడంతో అనుమానం కలిగింది. ఇంట్లోని ఇతర ప్రదేశాలు, బీరువాను పరిశీలించగా, మరికొన్ని బంగారు ఆభరణాలు కూడా కనిపించకుండా పోయినట్లు గుర్తించారు. వెంటనే గచ్చిబౌలి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) దృశ్యాలను పరిశీలిస్తూ, ఇతర ఆధారాలను సేకరిస్తున్నారు. అదే సమయంలో, అనుమానితులను గుర్తించి పట్టుకోవడానికి, దొంగిలించిన ఆభరణాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.






