3 July, 2026 | 9:08 PM

Breaking News

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) 2027 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి   •   ఆండాళ్ అమ్మవారికి ఊంజల్ సేవోత్సవం   •   పిచ్చిమొక్కల తొలగింపు   •   తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •  

జవహర్ నగర్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడీ

13-05-2026 03:21 PM

వృద్ధ దంపతులపై దాడి బంగారము వెండి నగదుతో ఉడాయించిన దుండగులు

జవహర్ నగర్,(విజయక్రాంతి): జవహర్‌నగర్‌ రాణా పరిధిలోని కౌకుర్ గోల్ఫ్ ఎన్‌క్లేవ్‌లో నేపాలీ గ్యాంగ్ భారీ దోపిడి చేసింది. ఈ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న ప్రొ. మురళీధర్ మోహన్, డాక్టర్ విజయలక్షీదంపతులను కొట్టేసి దాడి చేసి మత్తుమందు ఇచ్చి నేపాలీ గ్యాంగ్ దోపిడీకి పాల్పడింది. కోటి రూపాయల విలువైన బంగారం, వెండితో పాటు  నగదును ఈ గ్యాంగ్ దోచుకుపోయింది. మంగళవారం మిట్ట మధ్యాహ్నం ఈ దంపతులు మత్తు నుంచి తేరుకుని గట్టిగా కిటికిలో నుంచి అరవడంతో.. ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ ఇంటి తలుపులు తీశారు.

అనంతరం ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నేపాల్‌కు చెందిన ఒక జంట రెండు వారాల  క్రితమే తమ ఇంట్లో పని మనుషులుగా చేరారని ఈ దంపతులు పోలీసులకు వివరించారు. ఇటీవలే మరో మహిళ వచ్చి వారి బంధువుగా పరిచయమై తమ ఇంట్లో ఉంటోందని తెలిపారు. సోమవారం రాత్రి నేపాలీ మహిళ జన్మదిన వేడుకలు చేసుకుంటామంటే.. అందుకు అంగీకరించామని ఆ దంపతులు చెప్పారు. ఈ వేడుకలకు మరో ముగ్గురు బయట నుంచి వచ్చారని పేర్కొన్నారు.

ఈ వేడుకల అనంతరం భోజనం చేస్తుండగా.. వెనుక నుంచి వచ్చి తమపై ఈ నేపాలీ గ్యాంగ్ దాడి చేసిందని పోలీసులకు ఆ దంపతులు తెలిపారు. కాళ్లు, చేతులు కట్టేసి తమను బెదిరించడంతో.. మమ్మల్ని చంపకండి.. మీకు కావాల్సింది తీసుకెళ్లమని వారిని కోరినట్లు వారు చెప్పారు. దీంతో ఇంట్లో నగలతోపాటు విలువైన వస్తువులను ఈ గ్యాంగ్ దోచుకుపోయిందన్నారు. అనంతరం ఇంట్లోని సీసీ టీవీ కెమెరాలను ధ్వంసం చేసి.. అన్ని గేట్లకు తాళాలు వేసి వారు పరారయ్యారని వివరించారు.

ఈ దోపిడీలో మొత్తం ఏడుగురు వ్యక్తులూ పాల్గొన్నారని చెప్పారు. ఆ ఇంటిని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి పరిశీలించారు. దోపిడీ జరిగిన కాలనీలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు జల్లెడ పడుతున్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెప్పారు. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో మాజీ ఐపీఎస్ భార్య తనూజను నేపాలి గ్యాంగ్ హత్య చేసి దోపిడికి పాల్పడిన ఘటన మరువక ముందే ఈ ఘటన చేసుకోవడం  కలకలం రేపుతుంది.