07-12-2025 01:23:04 AM
ఈ నెలాఖరులో లేదా కొత్త ఏడాది ప్రారంభంలో..
రేసులో ధర్మేంద్ర ప్రధాన్.. దక్షిణాది నుంచి పరిశీలనలో కిషన్‌రెడ్డి పేరు
హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి): త్వరలో బీజేపీ నూతన జాతీయ అధ్యక్షుడిని ఢిల్లీ నాయకత్వం నియమించనుంది. ఇందుకు సంబంధించిన కసరత్తును అగ్రనాయకత్వం ఇప్పటికే చేపట్టిం ది. గత కొంతకాలంగా బీజేపీ జాతీయ నూతన అధ్యక్షుడి నియామక అంశం వాయిదాపడుతూ వస్తోంది. అయితే వీలైనంత త్వరగా దీనిని కొలిక్కి తేవాలని కేంద్ర పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈక్రమంలోనే ఈనెల చివరన లేదా కొత్త ఏడాది ప్రారంభంలో బీజే పీ నూతన జాతీయ అధ్యక్షుడి పేరును అధిష్ఠానం ప్రకటించే వీలున్నట్లుగా పార్టీ లో చర్చ జరుగుతోంది. అయితే అధ్యక్షు డు ఎవరై ఉంటారనే చర్చ కూడా జోరుగానే సాగుతోంది. బీజేపీ జాతీయ అధ్య క్షుడి రేసులో ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరితోపాటు మరికొందరు నేతల పేర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి.
పలు దఫాలుగా వాయిదా..
బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేదానిపై గత కొంతకాలంగా సందిగ్ధత కొనసా గుతోంది. 2020 నుంచి అధ్యక్షుడిగా జేపీ నడ్డా ఉంటూవస్తున్నారు. జాతీయ అధ్యక్షుడి నియామకం పలు దఫాలుగా వాయిదాపడుతూ వస్తోంది. లోక్‌సభ ఎన్నికలు, ఆతర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉండటంతో బీజేపీ అగ్రనాయకత్వం దీనిపై ఫోకస్ పెట్టలేదు. ఉప రాష్ట్రపతి ఎన్నికలు, బీహార్ శాసనసభ ఎన్నికలకు ముందే ప్రకటించాలనుకున్నారు.
ఎన్నికల ముందు కొత్త అధ్యక్షుడి నియామకం ఎందుకని పునరాలోచించిన హైక మాండ్ ఆ నిర్ణయాన్ని వాయిదా వేసుకుంది. దీంతోనే జేపీ నడ్డా పదవీ కాలాన్ని పొడిగిస్తూ వస్తున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికలు ముగియడం, అక్కడ ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన క్రమంలో ఇక నూతన జాతీయ అధ్యక్షుడి నియామకంపై ఢిల్లీ నాయకత్వం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది.
దక్షిణాదిలో పాగాకోసం..
ప్రస్తుతం దేశంలో ఏ రాష్ర్టంలో తక్ష ణం ఎన్నికలు లేకపోవడంతో నూతన అ ధ్యక్షుడి ప్రక్రియను పూర్తిచేసి వచ్చే ఏడాది (2026) మే, జూన్‌లో జరగబోయే ఎన్నికలకు సిద్ధమవ్వాలని పార్టీ భావిస్తోంది. ఈ రేసులో పలువురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నా, దక్షిణాదినుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడి రేసులో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేరు బలంగా వినిపిస్తోంది. రాబోయే కాలంలో దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాల్లో ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళలో పార్టీని విస్తరించాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది.
ఇక్కడ పాగా వేయాలంటే ఈ ప్రాంతం నుంచే జాతీయ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి బలం చేకూరుతుందని భావిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. కిషన్ రెడ్డికి పార్టీలో అపారమైన అనుభవం ఉంది. ఆయన భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షుడిగా, తెలంగాణ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడిగా నాలుగు సార్లు పనిచేసిన అనుభవం ఉంది. జనంలోనూ మంచి పేరుంది. అంతేకాకుండా ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు సన్నిహితుడిగా, విశ్వసపాత్రుడిగా పేరు ఉండటం సానుకూల అంశాలు.
నిర్మలా సీతారామన్ కూడా..
ఒకవేళ మహిళలకు ఇవ్వాలనుకుంటే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, దగ్గుబాటి పురందేశ్వరి, వనతి శ్రీనివాసన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీరు కూడా దక్షణాది రాష్ట్రాలకు చెందిన మహిళలే. అయితే ఇప్పటివరకు బీజేజీ జాతీయ అధ్యక్ష పదవిని మహిళలకు ఇవ్వలేదు. ఈసారి కూడా ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్.. ఈ పదవికి బలమైన పోటీదారుగా ఉన్నారు.
ఆయన ఒడిశా రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఓబీసీ నేత కూడా. దేశవ్యాప్తంగా ఓబీసీ రిజర్వేషన్లు, కులగణన, జనగణనపై చర్చ జరుగుతోంది. ఆయనకు ఆర్‌ఎస్‌ఎస్‌తో, పార్టీ సంస్థాగత యంత్రాంగంతో బలమైన సంబంధాలను కలిగి ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇటీవల ఒడిశాలో బీజేపీ అధికారంలోకి రావడంలో ఆయన పాత్ర కీలకమని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.
ఇదిలాఉంటే బీజేపీలో సాధారణంగా నూతన జాతీయ అధ్యక్షుడి ఎంపిక ఏకాభిప్రాయం ద్వారానే చేపడుతారు. ప్రాంతీయ ప్రాతినిధ్యం, సామాజిక సమీకరణాలు, సంస్థాగత అనుభవం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోపాటు మరికొందరు కీలక నేతలు తుది నిర్ణయం తీసుకుంటారు.
పలువురి పేర్లు..
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియామకం కంటే ముందు ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ర్ట అధ్యక్షుణ్న నియ మించాలని బీజేపీ భావిస్తోంది. దీనిపైన ఇప్పటికే మోడీ, అమిత్‌షా ఇటీవల ఢిల్లీలో భేటీ అయి సమాలోచనలు కూడా చేశారు. వారం రోజు ల్లో ఈ అంశాన్ని తేల్చి.. ఆ తర్వాత నూతన జాతీయ అధ్యక్షుడిని నియమించాలని కసరత్తు చేస్తున్నారు. పార్టీ రాజ్యాంగం ప్రకారం సగం కంటే ఎక్కువ రాష్ట్రాల్లో సంస్థాగత ఎన్నికలు పూర్తయిన తర్వాతే జాతీ య అధ్యక్షుడి ఎన్నిక ఉంటుంది.
ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకోగా, కొత్త అధ్యక్షుడి పేరును త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఈ పదవి రేసులో ప్రధానంగా కేంద్ర మంత్రు లు ధర్మేంద్ర ప్రధాన్, కిషన్ రెడ్డి, శివరాజ్ సింగ్ చౌహాన్, భూపేందర్ యాదవ్, మనోహర్ లాల్ ఖట్టర్, యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతోపాటు ఒకరిద్దరి పేర్లు సైతం వినిపిస్తున్నాయి.