11-01-2026 01:22:09 AM
బంగాళాఖాతంలో ‘చైనా నేవీ’ పాగా
రోజురోజుకు బలపడుతున్న బంగ్లా పాక్ మైత్రి
కేంద్ర ప్రభుత్వ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ, జనవరి ౧౦: బంగాళాఖాతంలో చైనా నావికాదళ కార్యకలాపాలు పెరుగుతుండటం, బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య సమీ కరణాల నేపథ్యంలో భారత నావికాదళం అప్రమత్తమైంది. పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా వద్ద కొత్త నేవీ బేస్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాంతంలో సముద్ర నిఘాను కట్టుదిట్టం చేయడంతో పాటు చొరబాట్లను అరికట్టడమే లక్ష్యంగా బేస్ పనిచేయనుంది. హల్దియాలో ఇప్పటికే ఉన్న డాక్ కాంప్లెక్స్ సదుపాయాలు ఉన్నాయి. కొత్తగా కేంద్రం ఇక్కడ ఒక జెట్టి, ఇతర రక్షణ మౌలిక సదుపాయాలు కల్పించనున్నది.
బేస్ పూర్తి స్థాయి కమాండ్‌గా కాకుండా, కేవలం చిన్న తరహా యుద్ధ నౌకల మోహరింపు కోసమే ఉపయోగపడుతుంది. బేస్ వద్ద అత్యాధునిక సీఆర్‌ఎన్ గన్లు, ‘నాగాస్త్ర’ వంటి ఆత్మాహుతి డ్రోన్లు బేస్ వద్ద సిద్ధంగా ఉంటాయి. బంగ్లాదేశ్ సరిహద్దుకు దగ్గరగా ఉండటం వల్ల సముద్ర మార్గాల ద్వారా జరిగే అక్రమ చొరబాట్లను అరికట్టడానికీ బేస్ ఉపయోగపడుతుంది. కోల్‌కతాకు 100 కిలోమీటర్ల దూరంలో ని ఈ ప్రాంతంలో బేస్ ఏర్పాటు చేస్తే, సైన్యం హుగ్లీ ప్రవాహం గుండా ప్రయాణించే అగత్యం తప్పుతుంది.